Wednesday, September 18, 2024
HomeNewsPOCSO help: బాధిత చిన్నారులకు ఆర్థిక సాయం

POCSO help: బాధిత చిన్నారులకు ఆర్థిక సాయం

మైనర్ రేప్ బాధితులకు పోక్సో చట్టం కింద ఆర్థిక సాయం

అత్యాచారాలకు గురైన చిన్నపిల్లలకు నిర్భయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది కాలం క్రితం నిర్ణయం తీసుకుని రాష్ట్రాలకు తెలియజేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టమైన ‘పోక్సో’ కింద నమోదైన కేసుల్లోని బాధితులకు కేంద్రం ఏర్పాటు చేసిన నిర్భయ నిధి నుంచి ఇక మీదట సహాయం లభిస్తుంది. పోక్సో
కిందకు వచ్చే బాధితుల సంరక్షణకు, అండదండలనివ్వడానికి సంబంధించిన వివరాలను
తమకు తెలియజేయాల్సిందిగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ సంస్థ (ఎం.డబ్ల్యు.సి.డి) ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

- Advertisement -

నిర్భయ నిధి పథకం కింద మైనర్ బాలికలకు ఆహార, వసతి, పునరావాస, విద్య, ఉపాధి శిక్షణ సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. వారి నిత్యావసరాలను అందజేయడం, న్యాయస్థానాలకు తరలించడానికి వారికిరవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడం, న్యాయ సహాయాన్ని అందజేయడం, అవసరమైతే వైద్య సహాయాన్ని ఏర్పాటు చేయడం వంటివి కూడా ఇందులో భాగాలే. అత్యాచారానికి గురైనవారికి, సామూహిక అత్యాచారానికి గురైనవారికి, గర్భం ధరించినవారికి, తల్లితండ్రులు లేదా
కుటుంబ సభ్యులు వదిలేసినవారికి, తమ కాళ్ల మీద తాము నిలబడడానికి అవకాశం లేని వారికి ఆశ్రయం కల్పించడం జరుగుతుంది.

నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో అందజేసిన వివరాల ప్రకారం, 2021లో దేశంలో పోక్సో చట్టం కింద సుమారు 52 వేల కేసులు చోటు చేసుకున్నాయి. ఇందులో 64 శాతం మంది మీద అత్యాచారం జరిగింది. మిగిలినవారిలో ఎక్కువ మంది మీద లైంగిక దాడి మాత్రమే జరిగింది. మొత్తం 34 వేల మంది మీద అత్యాచారం గానీ, సామూహిక అత్యాచారం గానీ జరిగినట్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా
దాదాపు బాధితుల ప్రమేయం లేకుండా, దౌర్జన్యంగా జరిగినవే. వీరిలో ఎక్కువ మంది గర్భం ధరించడం, అనేక శారీరక, మానసిక సమస్యలకు గురి కావడం, కుటుంబ సభ్యులు వదిలేయడం వంటివి జరిగాయి. మొత్తం మీద వీరిలో అత్యధిక శాతం మంది అనాథలుగా మిగిలిపోయారు. కాగా, ఇటువంటి పోక్సో బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

ఈ రకమైన బాధితులందరినీ ఒకే చోట ఉంచి, వారికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు, పోలీస్ సహాయం, న్యాయ సహాయం, విద్య, వైద్య సహాయం వంటివి సమకూర్చడం జరుగుతుంది. శారీరక ‍సమస్యలకే కాకుండా మానసిక సమస్యలకు కూడా చికిత్సా సౌకర్యం కల్పించడం జరుగుతుంది.ఈ బాధితులు గర్భం ధరించే పక్షంలో వారికి ప్రసూతి సౌకర్యం కల్పించడం, బాలింతలకు కూడా సహాయం అందించడం, చేదోడు వాదోడుగా ఉండడం, మానసికమైన కౌన్సెలింగ్ ఇప్పించడం, న్యాయ సహాయంతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. పద్ధెనిమిదేళ్ల లోపు వయసుండి, అత్యాచారానికి గురైనవారు మాత్రమే ఇందుకు అర్హులు. ఆ బాలిక కూడా గర్భం ధరించి ఉండడం, అనాథగా మిగిలిపోవడం, తల్లితండ్రులు విడిచిపెట్టడం, తనకు తానుగా కుటుంబం నుంచి వేరుపడడం వంటివి కూడా జరిగి ఉండాలి.

ఈ పథకం కింద సహాయం పొందడానికి బాధితురాలి వద్ద ఎఫ్.ఐ.ఆర్ కాపీ ఉండాల్సిన అవసరం లేదు. అయితే, బాధితుల సంరక్షణ బాధ్యతను స్వీకరించినవారు పోలీసులకు సమాచారం అందించి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాల్సి ఉంటుంది. పోక్సో బాధితులకు సహాయం అందించడానికి సంబంధించి శిశు సంరక్షణ కేంద్రాలకు కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేయడం జరిగింది. శిశు సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు ఇతర బాల బాలికలకు భిన్నంగా ఈ బాధితులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి
ఉంటుంది. ఇతర బాలికల అవసరాలు వేరు, ఈ బాధిత బాలికల అవసరాలు వేరనే సంగతిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాధితుల సంరక్షణకు ప్రత్యేకంగా ఒక మహిళను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సంరక్షణ కేంద్రానికి కేంద్రం ప్రత్యేకంగా, విడిగా నిధులు పంపించడం కూడా జరుగుతుంది. పోక్సో బాధితుల పునరావాసం, సహాయ సహకారాల కోసం మిషన్ వాత్సల్య కింద కూడా ఈ కేంద్రాలకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News