అసలే ఆర్థికమాంద్యం పేరుతో బడా కంపెనీలన్నీ ఉన్న ఉద్యోగాలను పీకేస్తుంటే.. ఓ ఉద్యోగి మాత్రం తన ఉద్యోగానికి సిల్లీ రీజన్ తో రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. నెలకు లక్షల్లో జీతం వచ్చే జాబ్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పైగా.. పనితక్కువ ఉండే జాబ్ అంటే.. అంతకన్నా అదృష్టం ఉండదనుకుంటారు. కానీ.. ఓ ఉద్యోగి మాత్రం నేను ఈ ఉద్యోగం చేయలేనంటూ రాజీనామా చేశాడు. పైగా ఎదురు తన యజమానిపై కోర్టులో కేసు కూడా పెట్టాడు. ఈ ఘటన ఐర్లాండ్ లో వెలుగుచూసింది.
పని ఎక్కువ.. జీతంతక్కువ.. చేసిన పనికితగిన జీతం ఇవ్వట్లేదని వాపోయే ఉద్యోగులు కోకొల్లలు. కానీ.. తనకు ఇచ్చే జీతానికి తగిన పని ఇవ్వట్లేదని వాపోయిన వ్యక్తి బహుశా ఇతనొక్కడే అయి ఉంటాడు. ఐర్లాండ్ లోని డబ్లిన్ లోని ఐరిష్ రైల్వేలో ఫైనాన్స్ మేనేజర్ గా పని చేస్తున్న డెర్మోట్ అలెస్టర్ మిల్స్.. నెలకు రూ.8లక్షలు జీతం తీసుకుంటున్నాడు. అయితే వారంలో ఒక్క రోజు కూడా చేసేందుకు పని లేదని, జాబ్ చాలా బోరింగ్ ఉందంటూ.. కంపెనీపై కేసు వేశాడు. అసలు ఉద్యోగం దొరకడమే కష్టమైపోయిన ఈ రోజుల్లో.. నెలకు రూ.8లక్షలు వచ్చే జాబ్ ని వద్దని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందంటున్నారు నెటిజన్లు. తినడం, తాగడం, న్యూస్ పేపర్లు చదవడం తప్ప మరేమీ పని లేకుండా పోయిందని మిల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం వారానికి ఒక రోజైనా చేయడానికి ఏదో ఒక పని ఉండి ఉంటే చాలా థ్రిల్‌గా ఉండేదన్నాడు.
“నేను ఉదయం 10 గంటలకు ఆఫీసుకి వెళ్తాను. రెండు వార్తా పత్రికలు, ఒక శాండ్‌విచ్ కొనుగోలు చేస్తాను. నేను నా కేబిన్ లోకి వెళ్తాను. నా కంప్యూటర్ ఆన్ చేస్తాను, ఈ-మెయిల్ చూస్తాను. అందులో పనికి సంబంధించిన ఒక్క మెయిల్ కానీ, మేసేజ్ లు కానీ, కమ్యూనికేషన్ కానీ ఉండవు. కనీసం సహోద్యోగి కమ్యూనికేషన్ కూడా ఉండదు. నేను కూర్చుని వార్తాపత్రిక చదువుతాను. నా శాండ్విచ్ తింటాను. ఉదయం 10.30 గంటలకు, సమాధానం అవసరమైన ఈ మెయిల్ ఉంటే, నేను దానికి సమాధానం ఇస్తాను. ఇదే నేను రోజూ చేసే పని” అని మిల్స్ చెప్పుకొచ్చాడు. ఏదొక జాబ్.. దానికి టైమ్ కి జీతమిస్తే చాలనుకునే ఈరోజుల్లో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.