ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఫలితంగా 2027 నాటికీ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని, బిజెపి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని దేశ రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సాంస్కృతిక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తనకు ఎమ్మేల్యే పదవి హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చిందని అన్నారు. 2018 లో స్వంత పార్టీ ఎమ్మేల్యే అయిన తన ఇంటి పై కెసిఆర్ రైడింగ్ చేయించారని మండిపడ్డారు. తన బాధని దుఃఖాన్ని సంతోషాన్ని పంచుకునే అడ్డ హుజూరాబాద్ అని అన్నారు. తనను బిఆర్ఎస్ పార్టీ బయటికి వెళ్లగొడితే అక్కున చేర్చుకున్న పార్టీ బిజెపి అని గుర్తు చేశారు. గత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఆత్మ గౌరవం గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో దళిత బంధు అమలు చేయాలంటే 40 సంవత్సరాలు పడుతుంది అని ఆనాడే చెప్పినని, ఇప్పుడు ఒక్క దళిత బంధు ఐదుగురు తీసుకొమంటున్నారు మంత్రులు. మరి డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇద్దరు తీసుకోవాలా అని ప్రశ్నించారు. తన వెంట వెంట నాయకులు లేరని చరిత్ర నిర్మాతలైన ప్రజలే ఉన్నారని అన్నారు. మాట ఇస్తే తప్పని బిడ్డ నరేంద్ర మోదీ అని అన్నారు. తెలంగాణలో విశ్వాసం కోల్పోయిన పార్టీ బి అర్ ఎస్ పార్టీ అని అన్నారు. బీజేపీనీ ఆశీర్వదిస్తే.. కిలో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, పేదవాళ్లకు ఉచిత విద్య వైద్యం అందించే బాధ్యత మాదే అని అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ…
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఇక్కడి ప్రజలను చూస్తుంటే రాజకీయ చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. తెలంగాణ రాణీరుద్రమ, కొమురంభీం పుట్టిన గడ్డ అని, 1984లో లోకసభ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలు గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి రెండోది తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డి గెలిచారని గుర్తు చేశారు.
గత 27 ఏళ్ళుగా గుజరాత్ ఎలా అభివృద్ధి చెందుతుందో మీరు చూస్తున్నారు గుజరాత్ సహా దేశమంతా అభివృద్ధి చెందుతుంటే తెలంగాణాలో మాత్రం అభివృద్ధి కుంటు పడడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రజల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు.
గతంలో తాము ఇచ్చిన ఉత్తరాఖండ్, ఛతీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా అభివృద్ధి జరుగుతున్నదో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక లిమిటెడ్ కంపెనీలా తయారైెందని, ఒక కుటుంబ అభివృద్ధికి మాత్రమే దోహదపడుతోందని, కెసిఆర్ కుటుంబ అవినీతిపై కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు.
ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీలో ఉన్నట్లు భావించి డబ్బు ఖర్చు పెట్టారు. కానీ ఈటల రాజేందర్ వారి ప్రయత్నాలన్నీ తిప్పి కొట్టారని. తాను ఈటలను అభినందిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని అయోధ్యలో రామమందిరం కడతామన్నాం ..కట్టి తీరుతున్నాం ..జనవరి 24 నుంచి దర్శనం కూడా కల్పించబోతున్నామని అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని అన్నాం.. చేసి చూపెట్టాం దేశవ్యాప్తంగా భూరికార్డులు డిజిటలైజ్ చేసి పారదర్శకంగా సమాచారం అందించడమే కాకుండా రుణ సౌకర్యం పొందే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఇక్కడ కూడా జరగాలంటే మీ సహకారం మాకు అవసరం బిఆర్ఎస్ కు ఇప్పటి వరకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు.. ఈసారి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని ప్రజలను కోరారు. భారత నారీ శక్తి అనే చట్టాన్ని బీజేపీ రూపొందించింది ..దీనితో 33 శాతం సీట్లతో మహిళల మనోబలం పెరుగుతుందని అన్నారు. గతంలో రాజీవ్ గాంధీ చెప్పినట్లు 100 రూపాయలు కేటాయిస్తే లబ్ధిదారునికి కేవలం 14 రూపాయలు చెరుతోందని, కానీ మోడీ ప్రభుత్వంలో అవినీతిని రూపు మాపేందుకూ ప్రయత్నిస్తున్నామన్నారు. కారు బేకారు అయిపొయింది. చేయి ప్రజలకు చెయ్యిచ్చింది. లక్ష్మి మీ ఇంటికి ఎవరి చేయి పట్టుకొనో రాదు. కమలం పూవుపై కూర్చొని వస్తుందని గమనించాలి. అందుకే బిజెపిని గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.