ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కొంతమంది విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అది నెరవేరేలా కనిపించడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉండగా అదేమీ తమకు సంబంధం లేనట్టు సంబంధిత మండల స్థాయి విద్యాధికారి. వేణు కుమార్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.
వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 52 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ ఆ పాఠశాలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడంతో తరగతులు బోధించేందుకు ఇబ్బందికరంగా మారుతుంది.
స్పందించని అధికారులు..
ఉపాధ్యాయుడు వ్యక్తిగత పనులపై సెలవులు పెట్టాల్సి వస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. డిప్యూటేషన్ పై ఉపాధ్యాయులను కేటాయించాలని పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ మండల స్థాయి అధికారులలో చలనం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తుందని స్థానికులు అంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పలుమార్లు మండల విద్యాధికారితో పాటు జిల్లా విద్యాధికారికీ సైతం ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు సదరు పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించడంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో సంబంధిత అధికారులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.