Friday, November 22, 2024
HomeNewsRural health: గ్రామీణ ఆరోగ్యానికి వదలని గ్రహణం

Rural health: గ్రామీణ ఆరోగ్యానికి వదలని గ్రహణం

గ్రామీణ ఆరోగ్యానికి సుస్తీ..

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ రానురానూ నిర్లక్ష్యానికి గురవుతోంది. నిజానికి గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లకు కొరత ఉండడమనేది దేశంలో కొత్తేమీ కాదు. గత కొద్ది సంవత్సరాల్లో గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వందల కొద్దీ స్పెషలిస్ట్‌ డాక్టర్ల నియామకాలకు అనుమతులు, నిధులు మంజూరు చేసినప్పటికీ, వాటిని భర్తీ చేయడం మాత్రం జరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతవారం విడుదల చేసిన తన తాజా నివేదికలో వెల్లడించింది. అనేక సంవత్సరాల నుంచి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సామాజిక ఉద్యమకర్తలు ప్రభుత్వాల చెవుల్లో ఇళ్లు కట్టుకుని పోరుతూనే ఉన్నారు. ప్రజల నుంచి కూడా వేల సంఖ్యలో ప్రభుత్వాలకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వాల్లో మాత్రం ఉలుకూ పలుకూ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నిజానికి, 2017లోనే పార్లమెంట్‌ నిపుణుల కమిటీ తన నివేదికలో ఈ సమస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఆందోళనకర విషయమేమిటంటే, 2017 తర్వాత నుంచి ఈ పరిస్థితి మరింతగా పెరిగిపోయింది. ప్రజల అవసరానికి, ఆరోగ్య కేంద్రాల అవసరానికి తగ్గట్టుగా ఏ రాష్ట్రంలోనూ స్పెషలిస్టుల సంఖ్యగానీ, సాధారణ డాక్టర్ల సంఖ్యగానీ పెరగడమన్నది జరగడమే లేదు. పైగా, దేశంలో డాక్టర్లు, రోగుల నిష్పత్తి చాలావరకు మెరుగు పడిందనే ప్రచారం జరుగుతోంది. వైద్య రంగంలో ప్రత్యేక నిపుణుల కొరత దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, దేశంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ 70 శాతం వరకూ ప్రత్యేక నిపుణులకు కొరత ఉంది. సర్జన్ల కొరత కూడా 73 శాతం వరకూ ఉందని నివేదిక తెలిపింది. స్పెషలిస్టులు, సర్జన్లకే కాదు, సాధారణ వైద్యులు, శిశు వైద్యులకు కూడా తీవ్రస్థాయిలో కొరత ఉందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు 336 మంది స్పెషలిస్టులను మంజూరు చేయగా అక్కడ ఇంతవరకూ ఏడుగురు స్పెషలిస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కర్ణాటకలో 45 ఉద్యోగాలు మంజూరు కాగా అది 14 మంది స్పెషలిస్టులతో సరిపెట్టుకుంటోంది. డాక్టర్ల కొరతపై కర్ణాటక హైకోర్టు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కొన్ని ప్రాణాంతక, ప్రమాదకర, దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు స్పెషలిస్టులు మాత్రమే చికిత్స చేయడం సాధ్యమవుతుంది. వీరి కొరత కారణంగా ప్రజారోగ్యం ఇప్పటికే చాలావరకు ప్రమాదంలో పడింది. వైద్య విద్య ఎంతగా పురోగతి చెందిందంటే వైద్య రంగంలోని అనేక విభాగాల్లో ప్రత్యేకీకరణలు, లోతైన ప్రత్యేకీకరణలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులకు కొరత ఏర్పడడానికి ప్రధాన కారణం, ప్రత్యేక నిపుణులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి విముఖంగా ఉండడమే. సాధారణంగా ప్రత్యేక వైద్య నిపుణులు విదేశాలకు వెళ్లడానికో, ప్రైవేట్‌ రంగంలో పనిచేయడానికో ఇష్టపడుతుంటారు. ప్రాథమికమైన డిగ్రీ కలిగిన డాక్టర్లు సైతం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి సుముఖంగా ఉండడం లేదు. మరొక కారణం కూడా ఉంది. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో రోగ నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి సరైన పరికరాలు, వసతులు, సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం కూడా ఇందుకు మరొక కారణం. సాధారణ అనారోగ్యాలకు కూడా గ్రామీణ ప్రాంత అనారోగ్య పీడితులు పట్టణాలకో, నగరాలకో రావలసి వస్తోంది. చాలామంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రయాణాలకు, సంప్రదింపులకు, రోగ నిర్ధారణలకు, చికిత్సకు వారికి తడిసి మోపెడవుతుంది. వైద్య కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్పెషలిస్టుల కొరత తీరడం లేదు.
ఈ జటిల సమస్యను పరిష్కరించడానికి పలువురు నిపుణులు పలు రకాలైన సూచనలు చేయడం జరిగింది. గ్రామీణ వైద్యానికి సంబంధించిన ప్రత్యేక కోర్సులను ప్రారంభించాలనే సూచన కూడా ప్రభుత్వాల ముందుకు వచ్చింది. అయితే, ఈ సూచనలు చర్చలు, వాదోపవాదాల స్థాయిని దాటి ముందుకు పోవడం లేదు. జనాభా పెరుగుతున్న కొద్దీ వైద్య అవసరాలు పెరగడం సహజం. దేశంలో ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్‌ కేటాయింపులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ కొరతలు, సమస్యలు ఎంత వరకూ పరిష్కారమవుతాయన్నది వేచి చూడాల్సిన విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News