ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాస్ట్యూమ్ & ఫ్యాషన్ అవార్డ్స్ (CFA) 2024ని నవంబర్ 30, డిసెంబర్ 1, 2024 తేదీలలో నగరంలోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నట్లు ఆర్వీ వల్లభనేని స్టూడియోస్ ప్రకటించింది. ఇది టాలీవుడ్ సినిమా వైభవానికి తోడ్పడుతున్న సాంకేతిక నిపుణులు, కాస్ట్యూమ్ డిజైనర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమని, దక్షిణ భారత దేశంలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్న తొలి అవార్డుల వేడుక ఇదేనని AARVV వల్లభనేని స్టూడియోస్ ప్రతినిధులు వల్లభనేని గోపీచంద్ , అరుణ సుకల తెలిపారు.
ఈ అవార్డులకు సంబంధించిన విశేషాలతో పాటుగా, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అక్టోబర్ 4, 2024న హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఖాలిద్ ఆల్ బలూషి , డాక్టర్ కబీర్ కె వి , వల్లభనేని గోపీచంద్ , డాక్టర్ అజితా సురభి, అరుణ శ్రీ సుకల , శివానీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలను వారు వెల్లడించారు.
షెడ్యూల్ చేయబడిన సిఎఫ్ఏ అవార్డ్స్ 2024, టాలీవుడ్ విజువల్ స్టోరీ టెల్లింగ్, ఫ్యాషన్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన కాస్ట్యూమ్ డిజైనర్లు, ఫ్యాషన్ నిపుణుల అసాధారణ సహకారాలపై దృష్టి సారిస్తుంది. ఈ సంవత్సరం, అవార్డుల వేడుకలో అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఉంటాయన్నారు.
వల్లభనేని గోపీచంద్ స్థాపించగా అరుణ సుకల నేతృత్వంలో ఆర్వీ వల్లభనేని స్టూడియోస్ కళాత్మకత, ఆవిష్కరణ, సస్టైనబిలిటీని గౌరవించే ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా ఫ్యాషన్ పరిశ్రమకు నాయకత్వం వహిస్తుంది. చలన చిత్రాలకు జీవం పోసినప్పటికీ తరచుగా పట్టించుకోని క్రాఫ్ట్‌లను గుర్తించాలనే ప్రయత్నంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భారతదేశం ఫ్యాషన్, చలనచిత్ర పరిశ్రమల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
టాలీవుడ్ వైభవాన్ని సజీవంగాముందుకు తీసుకువెళ్తూ తెర వెనుక అవిశ్రాంతంగా పని చేసే వ్యక్తులకు సిఎఫ్ఏ అవార్డులు ఒక నివాళి అని అరుణశ్రీ సుకల తెలిపారు.
ఈ కార్యక్రమంలో “అవర్ థ్రెడ్ అవర్ ప్రైడ్” పేరిట ఆర్వీ స్టూడియోస్ లేబుల్ తో భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించారు.