Sakshi: ఎందరో ముంబై భామలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూనే టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే అందాల భామ సాక్షి మడోల్కర్ కూడా తన నటనా ప్రస్థానాన్ని వెబ్ సిరీస్‌తో ప్రారంభించి, ఆ తర్వాత 2022లో ‘జహాన్ చార్ యార్’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఇక 2025లో రోషన్ కనకాల హీరోగా, జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘మోగ్లీ’ ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడం ఆమెకు నిరాశను మిగిల్చింది. దాంతో తన తదుపరి చిత్రంతోనైనా సక్సెస్ ను అందుకుని, ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావాలని ఆమె కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న‘కరికాల’ చిత్రంలో ఆమెకు ఓ హీరోయిన్ గా అవకాశం లభించడంతో మళ్లీ ఆమెలో ఆశలు చిగురించాయి. ఆ మేరకు వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం ఆమెకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మరో విజువల్ వండర్‌ను క్రియేట్ చేయాలన్నసంకల్పంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే.

