Peshawar: పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న చిన్నారులు విగతజీవులుగా మారారు. పాకిస్థాన్లోని పెషావర్లో ఓ ప్రైవేట్ పాఠశాల పైకప్పు కూలిపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 32 మంది విద్యార్థులు, ఓ మహిళా టీచర్ సహా మొత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఉదయం తరగతులు జరుగుతున్న సమయంలో పాఠశాల పై అంతస్తు పైకప్పు ఒక్కసారిగా కూలింది. దీంతో కింద ఉన్న తరగతి గదులపై శిథిలాలు పడటంతో విద్యార్థులు వాటి కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన చిన్నారులను ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది 7 నుంచి 14 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. తమ పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు పాఠశాల వద్దకు పరుగులు తీశారు.
మరోవైపు, భవనం నిర్మాణంలో లోపాలు ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పాఠశాల యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

