Saturday, October 12, 2024
HomeNewsSchool, temple and grave yard all the three are peacefull!: బడి..గుడి..స్మశానము..!

School, temple and grave yard all the three are peacefull!: బడి..గుడి..స్మశానము..!

ఏ మనిషి భూమిపై శాశ్వతంగా జీవించలేడు ..

బడి, గుడి, స్మశానము (సమాధి) ఈ మూడు ఒకదానికొకటి సంబంధం లేనివి కానీ ఈ మూడు ప్రశాంతమైన ప్రదేశాలే. ఒకటి విజ్ఞాన్ని మరియు వికాసాన్ని అందిస్తే, రెండోది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మూడోది మనిషి జీవిత కాలంలో ఏర్పరచుకున్న విలువలు మరియు పాటించిన ఆదర్శాలను ఆవిష్కరిస్తుంది. మనిషి పాశవిక దశ నుండి పౌరుడిగా ఎదిగిన తీరును కళ్ళ ముందుచుతుంది ఎలా బ్రతకాలో ఎలా బ్రతకగూడదో నేర్పిస్తుంది. మనిషిని మనీషిగా తీర్చిదిద్దేది సంఘంలో మంచివ్యక్తిగా, చరితార్ధుడిగా తయారు చేస్తుంది బడిలోనే. మనిషి అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు, చీకటి నుండి వెలుగుల వైపు పయనించగలడు. అంతమాటకొస్తే చదువుకున్న వారు చాలా మంది ప్రపంచ చరిత్రలో నేరస్థులుగా, నియంతలుగా, హంతకులుగా, అసమర్ధ పాలకులుగా చరిత్రకెక్కిన వారు వున్నారు. అక్షరం ముక్కరాని అక్బర్ చక్రవర్తి చక్కగా పాలించి గొప్ప పాలకుడిగా ఎదిగిన విధానం చరిత్రలో మనం చదువుకున్నామ్, అలాగే ఏమి ఆశించకుండా సమాజానికి తన జీవితాన్ని ధారపోసిన వారు కూడా వున్నారు.
మరి చదువుకున్న వ్యక్తికి “చదువు” సంస్కారం నేర్పిస్తుందని ప్రారంభంలోనే చెప్పుకున్నామ్ కదా మరి ఈ రకమైన వ్యక్తులు అలా ఎందుకు ప్రవర్తించారు అంటే “తరగతి గది” నుండి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి సంఘసేవకుడిగానో, సన్యాసిగానో మారి సమాజానికి ఉపయోగపడాలని ఏమిలేదు. అలాగే తరగతి గదిలో ఉన్న పిల్లలు ఒక విధమైన అభ్యసనా సామర్ధ్యాలు, మానసిక వికాసాలు, కుటుంబ నేపధ్యం కల్గి ఉండాలని ఏం లేదు కదా…! పేదరికంలో వుండి చదువు ద్వారా గొప్ప స్థాయికి ఎదిగి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారు వున్నారు, గొప్ప కుటుంబంలో పుట్టి చదువుకోని చరిత్రహీనులుగా మారిన వారు ఉన్నారు. కాబట్టి ఒకే అంశము నుండి అనేక రకాల ఫలితాలు వచ్చాయి అని మనం అర్ధం చేసుకోవచ్చును.
“మానవుడు సంఘజీవి” అంటాడు ప్రముఖ తత్త్వవేత్త అరిస్టాటిల్ సంఘం ద్వారా మనిషి సామూహిక జీవనానికి అలవాటు పడతాడు. సంఘంలో బడి, గుడి రెండూ ఉంటాయి. శిశువు, ఆదశ దాటేంత వరకు కుటుంబం పర్యవేక్షణలో పెరుగుతాడు ఆదశ దాటినా తర్వాత మిగిలిన జీవితాన్ని కొత్త వాతావరణంలోకి ప్రవేశించి గురువుల ద్వారా అనేక కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతాడు. బ్రతకడానికి కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలను తరగతి గదిలో నేర్చుకొని మిగిలిన జీవితాన్ని సమర్దవంతంగా పూర్తి చేయడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాడు. విద్య నేర్పమని “ఏకలవ్యుడు” గురు ద్రోణచార్యుడిని ఆశ్రయిస్తే విలువిద్యలు నేర్చుకోవడానికి ఆటవిక తెగలు అనర్హులని అవమానిస్తాడు, అదేవిధంగా కర్ణుడు విలువిద్యలు గురువు పరుశరాముడి వద్ద నేర్చుకున్న చేసిన తర్వాత అనుమానించి శపిస్తాడు. ఇక గురుద్రోణాచార్యుడు కురు – పాండవుల అభిరుచి మేరకు అస్త్రశస్త్ర విద్యలను నేర్పిస్తాడు. అలా అర్జునుడు మేటి విలుకాడిగా కురుక్షేత్ర యుద్ధంలో చేసిన వీరోచిత పోరాటాలు మనకు తెల్సిందే, అంతెందుకు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ బ్రహ్మస్త్రాన్ని దుర్వినియోగం చేసి కురు వంశం నాశనం చేయాలని ప్రయత్నం చేసిన విషయం తెలిసినదే. అంటే నేర్చుకొన్న విద్యను ఎలా ఉపయోగించుకొన్నాము. అనేది ఇక్కడ ఆయా సందర్భాలను వ్యక్తుల ఉద్దేశ్యాలను బట్టి ఆధారపడి వుంటుంది. సాందీపని ఆశ్రమంలో శ్రీ కృష్ణుడు కుచేలుడు ఎలా చదువుకున్నారో జగమెరిగిన సత్యమే.
మరి ప్రస్తుతం సమాజంలో గొప్ప చదువులు చదువుకున్న వారు మేధావులు గాను, ఉద్యోగస్తులుగాను, వ్యాపారస్థులుగాను, రాజకీయ నాయకులుగాను, సంఘ సేవకులు గాను ఎన్నో వివిధ రంగాలలో స్థిరపడి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి అవినీతికి పాల్పడి, రాజకీయాలలో వుంటే అక్రమాలకు పాల్పడటం వ్యాపారస్థులు నీతి నిజాయితీకి తిలోదకాలు అందినకాడికి దోచుకోవడం చూస్తూనే ఉన్నామ్. అంటే వీరు పాఠశాలలో చదువుకున్న, నేర్చుకున్న విద్యా విలువలు ఎటుపోయినట్టు, ఎందుకు ఇలా అక్రమ సంపాదనకు తెర తీసినట్లు అంటే వీరు ఏం నేర్చుకున్నారు? చదువు ఈ రకంగా వారిని పక్కదారి పట్టించింది అని భావించాలి. సరే తల్లి ఒడి నుండి బడిలో చేరిన వాడు “గురువు” ద్వారా నేర్చుకున్న విలువలు సామాజిక సర్దుబాటు ఇవన్ని తరగతి గది నుండే నేర్చుకొని సమాజం అనే విశాలమైన క్షేత్రంలోకి వస్తాడు. అలా వచ్చిన తర్వాత తరగతి గది వాతావరణం వేరు సమాజపు వాతావరణం వేరు అన్నింటిని సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతెందుకు మహాత్మ గాంధీ, అబ్దుల్ కలాం, అంబేడ్కర్, కందుకూరి, గురజాడ, టంగుటూరి ప్రకాశం, గిడుగు రామ్మూర్తి మొదలైన వారంతా తరగతి గది నుండి సమాజాన్ని ప్రభావితం చేసి చరిత్రక్కి మనకు మార్గదర్శకాలు అయ్యారు. సరే మరి నేటి అవినీతి నాయకుమాటేమిటీ వారు కూడా తరగతి గది నుండి వచ్చిన వారే కదా! మరి వారు ఆదర్శాలు, విలువలు తరగతి గదిలో నేర్చుకున్నా వారే కదా! వాటిని పాటించడంలో విఫలమైనారని అర్ధం చేసుకోవచ్చు. అందుకే వారు చరిత్రహీనులుగా, మరికొద్ది మంది చరితార్దులుగా మిలిలారు.
ఇక “గుడి” విషయానికొద్దాం “గుడి” అంటే కొద్దిమంది “మందిరం” అని, మరికొద్ది మంది “చర్చి”, “మసీదు”, “గురు ద్వారా”, “తోరా”, అని రకరకాల పేర్లతో సాంప్రదాయాలు ఏవైనా వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలిచినా మనిషి అసలు “గుడి”కి ఎందుకు వెళ్తాడు. అనేది ప్రశ్న? ప్రకృతిలో భాగమైన మనిషి చెట్టు, పుట్టను పూజించాడు, కాలగమనాలను గమనిస్తు తన దిన చర్యను నిర్దేశించుకొని ముందుకు కదిలాడు, తనను తాను కాపాటుడుకుంటూ ఆహార అన్వేషణకు బయలుదేరాడు. యాదృచికంగా కాల్చిన మాంసం ఒకరోజు దొరకటం ఆరుచి వేరుగా ఉండటం ఆదిమానవుడి జీవన శైలి ఆహారపు అలవాట్లు క్రమంగా మారుతు వచ్చాయి.
ఆ తర్వాత సామాజిక కట్టుబాట్లు, మేధో వికాసం ఫలితంగా ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మనుషుల మధ్య క్రమంగా పురుడుపోసుకున్నాయి. సమాజం కులాలుగా, మతాలుగా, జాతులుగా విభజింపబడటం మూలంగా ఏ మతం వారు ఆ మతాన్ని అనుసరించి, ఆ మతగ్రంధాలను, నియమాలను అనుసరించి ఆయా ఆచారాలను, పండుగలను, పర్వదినాలను, వస్త్రా ధారణను క్రమంగా పాటించి మనుషుల మధ్య విభజన రేఖలు గీశారని భావించాలి. ఇదంతా ఒక ఎత్తైతే మనిషి మానసిక విజ్ఞానం కోసం బడికి వెళ్తే మానసిక, శారీరక సౌఖ్యం కోసం, తన నిత్య జీవితంలో ఎన్నో రకాల ఆటుపాట్లు, సంఘర్షణలు ఎదుర్కొంటూ ప్రశాంతత కోసం ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అదే, “మందిరం, మసీదు, చర్చి, గుడి, గురుద్వారా” మొదలైనవి వాటిని ఇతరులు అందులోకి రాకుండా అడ్డుపడ్డాడు. ఆనాడు మొదలైన విషపు ఆలోచన నేటికి మనుషుల మధ్య విభజన రేఖలు ఇంకా పెరిగి పెద్దౌతున్నాయంటే వాటికి మూలాలు అక్కడే పడ్డాయి, అందుకు తగినట్లుగానే మనుషులను “మతం” ఆధారంగా విడగొట్టి మానవత్వం అనేది మరచి సంకుచితంగా మత యుద్ధాలు చేసుకున్నారంటే ఎంత మూర్ఖంగా మనుషులు ఆనాడు మత యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు చేసుకొని లక్షల మందిని బలిపశువులుగా బాధితులుగా, మిగిల్చారు? అంతెందుకు నేటికి కూడా యుద్ధాలు జగుతున్నాయి, అంటే దాని వెనుక గల సున్నితమైన అంశం “మతం” దాగి వుందనేది చారిత్రక సత్యం అంటే మతగ్రంధాలు మనుషుల మధ్యన విభజన రేఖలు గీశాయా? లేదా మనుషులే మత గ్రంధంలో ఉన్నది సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారా? అన్నది ప్రశ్న.
గుర్రం జాషువా అన్నట్లుగా “కుల మతాల గీతలు గీచుకొన్న గీతల చొచ్చి పంజరాన కట్టుపడును నేను” అన్నట్లుగా బడిలో లేని అడ్డుగోడలు “గుడి” విషయంలో ఎందుకు అన్నది ప్రశ్న? బడిలో అందరు చదువుకున్నట్లుగా గుడిలోకి కూడా అందరికి అవకాశం వుంటే ఎంత బాగుండేది అంటే మనిషి బడికి వెళ్తాడు, గుడికి వెళ్తాడు బడిలో లోకజ్ఞానం పొందిన మనిషి గుడి విషయంలో మళ్ళీ సంకుచితంగా ప్రవర్తించడం ఏమిటి? అనేది మనుషులుగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న!
ఇక “స్మశానము” గూర్చి మాట్లాడుకుందాం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి దగ్గరికి వెళ్ళి మృత్యువు సమీపిస్తున్నట్లుగా నువ్వు రేపు చావబోతున్నావ్ అంటే నేను ఎందుకు చస్తాను, నువ్వే చస్తావు అంటాడు, పండు ముసలికి కూడా నువ్వు చచ్చిపో ముసలిదానా అంటే నువ్వు చావు అంటు ఎదురు సమాధానం ఇస్తుంది. మరి ఇదే ముసలావిడ మరియు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగస్తుడు ఇద్దరూ బాల్యంలో బడికి వెళ్ళిన వారే, పెరిగి పెద్దైన తర్వాత ఏ గుడికో, చర్చికో లేదా మందిరానికో సంతోషంగా వెళ్ళిన వారే కానీ వృద్ధాప్యాన్ని మాత్రం ఎవరు ఆపలేరు కదా! దాన్ని ఆపే శక్తి మనుషులకు లేదు కదా! మరి చావు దగ్గరకొస్తున్నకొద్ది ఎందుకు భయపడ్తాడు అంటే ఇంకా ఈ భూమిపై బ్రతకాలి.
వీలున్నంత వరకు మనుషుల మధ్య విభజన రేఖలు గీస్తు అనేక రకాల సంఘర్షణలకు కారకుడిగా మారాలి అనేది అంతర్గతంగా దాగివున్న పైశాచికానందం. ఎంత పరిపక్వత వుంటే మనిషి మృత్యువును సంతోషంగా ఆహ్వనించగలడు? అంతటి పరిపక్వత వున్న వ్యక్తి స్థితప్రజ్ఞుడే అవుతాడు? చావు వస్తున్నట్లు ముందే తెలిస్తే తప్పించుకొని తిరుగడామరి? బడికి వెళ్ళడానికి ఇష్టపడకపోయినా గుడికి వెళ్ళడానికి ఇష్టపడకపోయిన మృత్యువును తప్పించుకోలేం కదా ! అందుకే “జాతస్యహి ద్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహర్యే అర్ధేనత్వం శోబితుమర్హసి” కాబట్టి మరణించే ప్రతి జీవి మంచిగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యాలి, ఓ మాంసాహార జీవిని శాఖాహార జీవిగా మార్చలేం, కానీ మనిషి మాత్రం అనేక రకాల ఆహారపు అలవాట్ల ఆధారంగా మనుగడ కొనసాగించగలడు.
అందుకే స్మశాన వైరాగ్యంను ఆవాహన చేకొని ఎవరికీ హాని తలపెట్టకుండా భూమిపై బ్రతికినన్ని రోజులు బాగా బ్రతికాడురా అనిపించుకుంటే చాలు, కానీ చెడ్డవాడిగా ముద్రవేయించుకొని వెళ్ళిపోవడం వల్ల ఉపయోగమేమిటి అన్నది ఆలోచించాలి, కనిపించని దేవుడు, దయ్యాలకు, స్వర్గ, నరకాలకు భయపడే వ్యక్తి కళ్ళముందున్న వ్యక్తిలో కులం, మతం, పేదవాడు, ధనికుడిగా విభజనరేఖలు గీస్తు ప్రశాంతమైన సమాజంలో అలజడికి మనమే కారకులమౌతున్నాం అనేది అక్షరాల నిజం.
ఏ మతస్థుడైన ఎలాంటి కుటుంబంలో పుట్టినా చనిపోయిన తర్వాత చివరిగా వెళ్ళేది స్మశానానికే అంటే తల్లి గర్భములో ప్రారంభమైన ప్రయాణం చివరికి మట్టిలో కలిసే వరకు ఈ మధ్య కాలంలో గడిపిన జీవితం, మనం సమాజంతో, వ్యక్తులతో ఏర్పరచుకున్న బంధాలు వాటి తాలూకు జ్ఞాపకాలతో మనిషి చేసిన ప్రయాణం స్మశానం (సమాధి)తో ముగుస్తుంది. రాజ్ ఘాట్, (గాంధీ) చైత్ర భూమి (అంబేడ్కర్) మొదలైన సమాధులను పర్యాటకులు, రాయబారులు, దేశాద్యక్షులు వచ్చినప్పుడు సందర్శించి నివాళి అర్పిస్తున్నారంటే వారి గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చును. అంటే ఏ మనిషి పుట్టిన తర్వాత భూమిపై శాశ్వతంగా జీవించలేడు ఏదో ఒక రోజు మృత్యువు దరిచేరుతుంది కాబట్టి అటువంటి మృత్యువుకు సైతం “కన్నీరు” తెప్పించేలా మనిషి బ్రతకాలి. అలా “జన్మ సార్ధకత” జీవిత సాఫల్యాన్ని పొందితే ఎప్పుడు చనిపోయినా ప్రజల జ్ఞాపకాలలో చిరస్థాయిగా “చిరంజీవిగా” నిలబడిపోతాం. అందుకే నీతిగా నిజాయితిగా విలువలతో కూడిన జీవితాన్ని గడిపి మన జ్ఞాపకాలను పదికాలాలపాటు నిలుపుకుందాం.

- Advertisement -

డా.మహ్మద్ హసేన,
అధ్యక్షులు
తెలుగు శాఖ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాలియా
నల్లగొండ జిల్లా,
సెల్: 9908059234.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News