Friday, September 20, 2024
HomeNewsShyamji Krishna Varma: లండన్‌ కేంద్రంగా స్వతంత్ర శంఖారావం పూరించిన శ్యాంజీ కృష్ణ వర్మ

Shyamji Krishna Varma: లండన్‌ కేంద్రంగా స్వతంత్ర శంఖారావం పూరించిన శ్యాంజీ కృష్ణ వర్మ

ఆయన కన్నుమూసిన 56 ఏళ్ల అస్తికలను భారత్ కు తెచ్చిన మోడీ

అక్టోబర్‌ 2వ తేదీన భారత జాతిపిత మహాత్మా గాంధీ మరియు అత్యుత్తమ భారత ప్రధానులలో ఒకరైన లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి అని తెలియని భారతీయుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఆర్య సమాజ్‌ స్థాపకుడు దయానంద సరస్వతి అనుచరుడు, సంస్కృత పండితుడు, వారిరువురి తరువాత సరిగ్గా రెండు రోజులకు అంటే 4 అక్టోబర్‌ న జన్మించి భారత స్వాతంత్య్ర సముపార్జనలో తనదైన శైలిలో బ్రిటిష్‌ గడ్డపై నుండే పోరు సలిపిన ధీరోదాత్తుడు శ్యాంజీ కృష్ణ వర్మ గురించి దాదాపుగా చాలామందికి తెలియదు. స్వదేశంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఆయన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధించడానికి లండన్‌ వెళ్లారు. సంస్కృత భాషపై ఆయనకున్న లోతైన పరిజ్ఞానం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో సబ్జెక్ట్‌ ప్రొఫెసర్‌ మోనియర్‌ విలియమ్స్‌ దృష్టిని ఆకర్షించింది.
ఆయన నేతృత్వంలో ఇంగ్లాండ కేంద్రంగా ఇండియా హౌస్‌, ఇండియన్‌ హోమ్‌ రూల్‌ సొసైటీ, ది ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ పత్రికలను స్థాపించబడ్డాయి. నాటి స్వాతంత్య్ర సమరయోధులైన వీర్‌ సావర్కర్‌, సర్దార్‌ భగత్‌ సింగ్‌, మదన్‌ లాల్‌ ధింగ్రా, మేడం భికాజీ కామా, లాలా హరదాయళ్‌ వంటి వారికి సమయానుసారం సలహాలు, సూచనలు ఇస్తూ విప్లవ శంఖారావం పూరించిన మహా యోధుడు ఆయన. విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వచ్చిన విద్యార్థులను సంఘటితపరిచి వారిలో జాతీయ భావ విత్తనాలు నాటి, పెంచి, పోషించి తిరిగి వారిని శస్త్రాలుగా బ్రిటిష్‌ వారిపైకి కరడుగట్టిన దేశభక్తుడు. దయానంద్‌ సరస్వతి అనుచరుడైన ఆయన బాంబే ఆర్యసమాజ్‌కు ప్రథమ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన భారత దేశంలోని అనేక రాష్ట్రాలకు దివాన్‌గా కూడా పనిచేశారు.
4 అక్టోబరు 1857న మాండవి, కచ్‌, గుజరాత్‌ (నాటి బ్రిటిష్‌ ఇండియా) లో జన్మించిన ఆయన ముంబయిలోని విల్సన్‌ హైస్కూల్లో పాఠశాల విద్యను సంస్కృతంలో పాండిత్యం సంపాదించిన ఆయన 1875లో స్వామీ దయానంద సరస్వతి స్ఫూర్తితో వేదతత్వంపై అధ్యయనం చేసి 1877లో వారణాశి విశ్వవిద్యాలయం నుండి పండిట్‌ బిరుదు పొందారు. ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తరువాత 1885లో స్వదేశం తిరిగొచ్చి న్యాయవాదిగా కొనసాగారు. 1897లో ఆ వృత్తిని వీడి మళ్లీ లండన్‌ తిరిగి వెళ్లారు. 1900లో అక్కడ ఇండియా హౌస్‌ను, 1905లో ది ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ పత్రికను స్థాపించడంతో పాటు స్వరాజ్య సాధన లక్ష్యంగా ఇండియా హోం రూల్‌ సొసైటీని స్థాపించి తన సొంత డబ్బుతో భారతదేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు హెర్బట్‌ స్పెన్సర్‌ మరియు దయానంద సరస్వతి పేర ఉపకార వేతనాలివ్వడంతో పాటు లండన్‌లో చదువుకోవటానికి కూడా వారిని ప్రోత్సహించేవారు. ఇలా లండన్‌ కు వచ్చే విద్యార్థులు మరియు ఇతర భారతీయులతో ఇండియా హౌస్‌ క్రమంగా లండన్‌ లో జాతీయోద్యమ వేదికగా రూపాంతరం చెందడం ఆయన జాతీయ భావజాలానికి నిదర్శనం. ఇండియన్‌ హోమ్‌ రూల్‌ సొసైటీ ద్వారా భారత దేశంలో బ్రిటిష్‌ పాలనను విమర్శించారు.
విదేశాలకు స్వరాజ్య కాంక్ష విస్తరణ
బ్రిటన్‌లో న్యాయవాదిగా కొనసాగుతూనే బ్రిటన్‌ తో సహా మిగిలిన ఐరోపా దేశాల్లోను భారత స్వరాజ్య కాంక్షను మరియు ఆవశ్యకతను విస్తరింపచేయడంలో శ్యాంజీ కృష్ణ వర్మ ఇతోధిక కృషి చేసారు. లండన్‌లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న ఆయన 1905లో భారత్‌ లో బ్రిటిష్‌ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్రాసినందుకు దేశద్రోహ ఆరోపణలపై ఇన్నర్‌ టెంపుల్‌ అతనిని న్యాయవాదిగా కొనసాగడాన్ని నిషేధించింది. లండన్‌లోని న్యాయవాదులు మరియు న్యాయమూర్తుల కోసం నాలుగు వృత్తిపరమైన సంఘాలలో ఒకటైన హానరబుల్‌ సొసైటీ ఆఫ్‌ ది ఇన్నర్‌ టెంపుల్‌ ప్రతిష్టాత్మకమైనది కావడంతో, ఆ సంఘం నిర్ణయం ప్రకారం ఆయనను న్యాయవాద వృత్తిలో కొనసాగడాన్ని పూర్తిగా నిషేధించడమైనది. భారత స్వాతంత్య్రం కోసం లండన్‌ కేంద్రంగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి బ్రిటన్‌ న్యాయస్థానాలలో ఆయన అడుగు పెట్టకుండా చేయడమే కాక ఆయన కదలికలపై పోలీసుల విస్తృత నిఘా ఏర్పాటు చేయడంతో ఆయన 1907లో లండన్‌ నుండి తప్పించుకుని ఫ్రాన్స్‌ (ప్యారిస్‌) చేరుకున్నారు. ఆయనకు ఫ్రాన్స్‌ రాజకీయ వర్గాలలో ఉన్న పలుకుబడి కారణంగా ఎలాగైనా ఆయనను తిరిగి బ్రిటన్‌ కి రప్పించాలని అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కింగ్‌ జార్జ్‌ ఫ్రాన్స్‌ పర్యటన నేపథ్యంలో, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత ఆయన అక్కడి నుండి స్విట్జరాల్యాండ్‌ చేరుకొని అక్కడ జెనీవాలో ఒంటరి జీవితం గడిపారు. దీనిని అవకాశంగా తీసుకుని బ్రిటన్‌ అధికారులు తమ ప్రాబల్యంతో ఆయనను అక్కడ గృహనిర్బంధం చేయించారు. బ్రిటన్‌ గూఢచారులు, తన సన్నిహితులు అనుకున్నవారు మోసం చేయడంతో 30 మార్చ్‌ 1930 న ఆయన స్విట్జరాల్యాండ్‌ లోనే కన్నుమూసారు.
దేశద్రోహ ఆరోపణలు మోపబడ్డ శ్యాంజీ కృష్ణ వర్మ పరిపూర్ణమైన న్యాయ విచారణకు నోచుకోలేదని పాలక మండలి అభిప్రాయ పడడంతో 2015లో మరణానంతరం ఇన్నర్‌ టెంపుల్‌ చేత తిరిగి న్యాయవాదిగా నియమించబడ్డాడు.
తన జీవిత సర్వస్వాన్ని, సంపదను భారత స్వాతంత్య్ర సాధన కోసం అర్పించిన శ్యాంజీ కృష్ణ వర్మ, మరణానంతరం తన అస్థికలను భారత్‌ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాతనే అప్పగించాలని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వంతో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అతని మరణ వార్తను ప్రపంచానికి తెలియకుండా చేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం చేసిన కుటిల ప్రయత్నం విఫలమైంది. లాహోర్‌ జైలులో భగత్‌ సింగ్‌ తదితర విప్లవకారులు ఆయనకు నివాళులర్పించారు. అంతేకాక బాల గంగాధర్‌ తిలక్‌ ప్రారంభించిన ఆంగ్ల దినపత్రిక మరాఠా కూడా ఆయనకు నివాళి అర్పించింది. 22 ఆగస్టు 2003 న నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కి స్విట్జరాల్య్‌ండ ప్రభుత్వం శ్యాంజీ కృష్ణ వర్మ మరియు అతని భార్య భానుమతి అస్థికలను అప్పగించింది. శ్యాంజీ కృష్ణ వర్మ స్మృతి చిహ్నంగా లండన్‌ హైగేట్‌లోని ఇండియన్‌ హౌస్‌ ను పోలిన భవంతినే ఆయన జన్మస్థలమైన మాండ్వా సమీపంలో క్రాంతి తీర్థ్‌ అనే పేరుతో 2010లో నిర్మించింది గుజరాత్‌ ప్రభుత్వం. సువిశాలమైన 52 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్మారక ప్రాంగణంలో శ్యాంజీ కృష్ణ వర్మ మరియు అతని భార్య విగ్రహాలతో పాటు కృష్ణ వర్మ, అతని భార్య చితాభస్మం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన పూర్వపు కార్యకర్తల కోసం అంకితం చేసిన గ్యాలరీ సందర్శకుల దర్శనార్థం అక్కడ భద్రపరచబడ్డాయి. ఆయన స్మారకార్థం భారత ప్రభుత్వం 4 అక్టోబరు 1989 న ఇండియా పోస్ట్‌ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. భారత స్వాతంత్య్రం కోసం తనదైన శైలిలో అలుపులేని పోరాటం చేసిన శ్యాంజీ కృష్ణ వర్మ గౌరవార్థం కచ్‌ విశ్వ విద్యాలయానికి ఆయన పేరు పెట్టారు.
యేచన్‌ చంద్రశేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, తెలంగాణ

  • 8885050822
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News