Siricilla: బతుకమ్మ పండుగతో సిరిసిల్ల కలెక్టరేట్లో సందడి నెలకొంది. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను సిద్ధం చేసి పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కూడా వారితో కలిసి బతుకమ్మ ఆడటంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తమ శాఖల తరఫున బతుకమ్మలను అందంగా అలంకరించారు. వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.. మహిళలతో కలిసి పాటలు పాడుతూ ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బతుకమ్మల్లో జిల్లా వ్యవసాయ శాఖకు మొదటి బహుమతి దక్కింది. రెవెన్యూ శాఖ రెండో స్థానంలో నిలవగా, తంగళ్లపల్లి ఎంపీపీఎస్కు మూడో బహుమతి లభించింది. విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఉద్యోగులు ఎంతో ఆసక్తితో బతుకమ్మలను సిద్ధం చేసి వేడుకల్లో పాల్గొనడాన్ని ఆమె అభినందించారు.

