Saturday, November 15, 2025
HomeNewsSLBC completed soon: 2027 చివరి నాటికి ఎస్ఎల్‌బీసీ

SLBC completed soon: 2027 చివరి నాటికి ఎస్ఎల్‌బీసీ

Uttam Kumarreddy: ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, డిసెంబర్ 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. మంగళవారం జలసౌధలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీ పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లు రూపొందించిన నివేదికను ఈ నెల 15న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి, ఆపై పనులు మొదలుపెడతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల హైలెవల్ కెనాల్ ద్వారా 2.20 లక్షలు, ఉదయ సముద్రం ద్వారా లక్ష, లోలెవల్ కెనాల్ ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అలాగే తాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

డిండి పథకం ద్వారా 8 రిజర్వాయర్లకు నీళ్లు
డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 8 రిజర్వాయర్ల నుంచి 3.61 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. సింగరాజుపల్లి, ఎర్రబెల్లి-గోకారం, ఇర్షిన్, గొట్టెముక్కుల, చింతపల్లి, కృష్ణరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి దుందుభి వాగు వరకు నీటిని తరలించేందుకు పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. ఉదయసముద్రం ప్రాజెక్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి చెప్పారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువలు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కాల్వల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు పనులు 93 శాతం పూర్తయ్యాయి. గంధమల్ల రిజర్వాయర్ పరిధిలోని కాల్వల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా నీటి లభ్యత ఆధారంగా కొత్తగా 11 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వీటివల్ల 15 వేల ఎకరాల స్థిరీకరణతో పాటు 14,506 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని వివరించారు. ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన అటవీశాఖ అనుమతులను, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పునరావాస ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.

నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం వల్ల పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 2005లో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణానికి శ్రీకారం చుట్టానని గుర్తు చేశారు. కేవలం రాజకీయ కారణాలతో గత పదేళ్లుగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఇక నార్కట్‌పల్లి, కట్టంగూరు, మునుగోడు మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు చేపట్టామని వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ రిజర్వాయర్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు ప్రారంభించామన్నారు. అధికారులు తక్షణమే వాటర్ పంపింగ్ చేసి రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

పనులను త్వరగా పూర్తి చేయాలి: గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు. పుట్టగండి, నెల్లికల్, పిలాయిపల్లి కెనాల్, ధర్మారెడ్డి కెనాల్స్ పనులలో వేగం పెంచాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌, లక్ష్మారెడ్డ, మందుల సామేల్, నల్లగొండ, భువనగిరి యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు మూడు విభాగాలకు చెందిన ఈఎన్సీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad