Telugu prabha Viral news: కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ యువతి ఏకంగా రూ.12 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అత్యంత వేగంగా గాఢనిద్రలోకి వెళ్లినందుకు ఆమెను విజేతగా ఎంపిక చేశారు. నాణ్యమైన నిద్ర ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ‘కోలా స్లీప్ జపాన్’ సంస్థ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
‘మ్యాట్ రేస్’ పేరుతో జరిగిన ఈ పోటీలో పాల్గొన్నవారికి ప్రత్యేక పరుపులను ఏర్పాటు చేసి, నిర్ణీత సమయం వరకు నిద్రించే అవకాశం కల్పించారు.పోటీదారులు నిద్రలోకి వెళ్లిన తీరు, వారి నిద్ర నాణ్యతను తెలుసుకునేందుకు ఆధునిక పర్యవేక్షణ పరికరాలను వినియోగించారు. గుండె స్పందనతో పాటు మెదడు తరంగాల్లో చోటుచేసుకునే మార్పులను నమోదు చేశారు. ఈ వివరాల ఆధారంగా ఎవరు తక్కువ సమయంలో గాఢనిద్ర దశకు చేరుకున్నారో నిర్ణయించారు.
ఈ పోటీలో ‘సుయిమీ’ అనే యువతి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర పోటీదారులతో పోలిస్తే ఆమె వేగంగా గాఢనిద్రలోకి వెళ్లడంతో విజేతగా నిలిచారు. బహుమతిగా ఆమెకు 20 లక్షల యెన్లు అందించారు. భారత కరెన్సీ ప్రకారం ఈ మొత్తం దాదాపు రూ.12 లక్షలు. మానసిక ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. పోటీలో విజేతగా నిలిచిన యువతికి నగదు బహుమతి లభించడంతో ఈ కార్యక్రమం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

