కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్(Budget) కేవలం అంకెల గారడీలా ఉందని వైసీపీకి చెందిన శాసనమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా తరువాత అసెంబ్లీ బయట వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లను పొగడ్తలతో ముంచేత్తడానికే బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారని వారు మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా, అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ ను ఆత్మస్తుతి-పరనిందతో ముగించారని అన్నారు.
బడ్జెట్ పేరుతో మరోసారి వంచన: శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ,
గత ప్రభుత్వాన్ని దూషిస్తూ సీఏం, ఆయన తనయుడిని ప్రశంసలతో ముంచెత్తుతూ… కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. చట్టసభల్లో సభ్యుడుగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎప్పుడూ ఇలా పొగడ్తలతో బడ్జెట్ ను ముంచేయడం చూడలేదు. ఇటువంటి సంప్రదాయం కొత్తగా ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు ఇన్నిసార్లు చంద్రబాబు, లోకేష్ లను పొగడటం చేశారో అర్థం కాలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై కేటాయింపులు ఎక్కడా లేవు. ప్రభుత్వం ప్రజలను మళ్ళీ మోసం చేసింది. సూపర్ సిక్స్ అంటూ గొప్పగా ప్రజలను నమ్మించారు. మహిళలకు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15వేలు, నిరుద్యోగులకు రూ.3000 భృతి, రైతులకు రూ.20వేల భరోసా అన్నారు. కానీ వాటికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్ధులు ఉన్నారు. వారికి తల్లికి వందనం ఇవ్వాలంటే దాదాపు రూ.12వేల కోట్లు అవసరం. కానీ కేటాయింపులు చూస్తే కేవలం రూ. 9,400 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో కింద 52 లక్షల మందికి మా ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం. ఈ రోజు అంతమందికి ఇరవై వేల చొప్పున సుమారు రూ.12వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్ లో కేటాయించింది నామమాత్రమే. మహిళలకు అట్టహాసంగా ఉగాది నుంచి ఉచిత బస్సు అన్నారు. దీనిపై ఎక్కడా ప్రస్తావనే లేదు. ఇక మూలధన వ్యయంపై పొంతన లేకుండా చూపించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో రూ.3000 కోట్లు మార్కెట్ ఇంట్రవెన్షన్ కింద నిధిని ఏర్పాటు చేసి, రైతులను ఆదుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇదేనా రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ప్రేమ? మిర్చియార్డ్ లో రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్ళిన వైయస్ జగన్ గారిపైన కేసులు పెట్టారు. ఇప్పుడు బడ్జెట్ లో మిర్చి రైతులకు ధర లభించడం లేదు, కేంద్రం ఆదుకోవాలని ప్రస్తావించారు. ఈ రోజు వరకు ఒక్క బస్తా మిర్చి అయినా ప్రభుత్వం కొనుగోలు చేయించిందా? బడ్జెట్ సమావేశాల్లో వైకాపా నిర్మాణాత్మకంగా ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను ఎండగడుతుంది.
ఉత్పాదక రంగానికి కేటాయింపులు లేవు: కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ
అంకెలే తప్ప అభివృద్ది కనిపించని బడ్జెట్ ఇది. బడ్జెట్ అనేది భవిష్యత్ తరానికి సంబంధించి ఆలోచనలతో కూడుకున్నదై ఉండాలి. ఏ రంగంలోనూ స్పష్టత లేకుండా కేవలం రూ.3.26 లక్షల కోట్లు అంటూ అంకెలను ప్రకటించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఎక్కడా బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేవు. మూలధన వ్యయం గురించి చాలా అస్పష్టంగా పొందుపరిచారు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే దానివల్ల అభివృద్ది సాధ్యమవుతుంది. ఈ బడ్జెట్ లో ఉత్పాదకరంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఉత్పాదకరంగంపై బడ్జెట్ కేటాయింపులు లేకుండా సంపద ఎలా సృష్టిస్తారు? ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఇది. రైతాంగాన్ని, నిరుద్యోగులను విస్మరించారు. సూపర్ సిక్స్ కు సంబంధించి ఏ విషయం మీదా క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్సుకు కేటాయింపులు లేవు. నిరుద్యోగులకు మూడు వేల హామీ పై ప్రస్తావనే లేదు. రైతాంగాన్ని ఆదుకునేందుకు చేసిన కేటాయింపులు లేవు. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ లోని డొల్లతనంపై ఖచ్చితంగా ప్రభుత్వంను నిలదీస్తాం. సామాన్య ప్రజానీకానికి ఈ బడ్జెట్ వల్ల ఒరిగేది లేదు. మాటలతో గారడీ చేసిన బడ్జెట్ ఇది. ఏ వర్గానికి ఎటువంటి ప్రయోజనం లేదు.
మహిళలను వంచించిన కూటమి ప్రభుత్వం: వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ
రాష్ట్ర బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు. గత బడ్జెట్ లోనూ దారుణంగా ప్రజలను మోసం చేశారు. పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ లో అయినా హమీల అమలుకు కేటాయింపులు చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. మహిళలకు సూపర్ సిక్స్ లో పెద్దపీట వేస్తున్నామని హామీలు ఇచ్చారు. కానీ నేడు బడ్జెట్ లో వాటికి సంబంధించిన కేటాయింపులు కనిపించడం లేదు. మేనిఫేస్టోలో పెట్టిన ఏ అంశాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. మహాశక్తి పథకంపై ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. గత బడ్జెట్ లో మహాశక్తి పథకానికి నిధులు కేటాయించేశామంటూ హోంమంత్రి ఆర్భాటంగా సభలో మాట్లాడారు. గత బడ్జెట్ లోనూ, ఈ రోజు పూర్తిస్థాయి బడ్జెట్ లోనూ ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఈ బడ్జెట్ లో దానికి సంబంధించిన ఊసే లేదు. తల్లికి వందనం, రైతుభరోసాకు అరకొర నిధులు కేటాయించారు. తల్లికి వందనం అమలుకు రూ.12,000 కోట్లు కావాలి. కానీ వారు తాజా బడ్జెట్ లో కేవలం 9,400 కోట్లు కేటాయించారు. జగన్ గారు సీఎంగా కొనసాగి ఉన్నట్లయితే గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా ఈ పథకం ద్వారా విద్యార్ధుల తల్లులకు డబ్బు జమ అయ్యేది. కానీ గత ఏడాది తల్లికి వందనంను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో కాకుండా తక్కువగానే కేటాయింపులు చేశారు. గత ఏడాది ఆలస్యంగా పెట్టిన బడ్జెట్ లో తల్లికి వందనం కోసం రూ. 5,387 కోట్లు కేటాయించారు. ఆ నిధులు ఏమయ్యాయి? దీపం పథకంపై గత బడ్జెట్ సమావేశాల్లో చాలా గొప్పలు చెప్పారు. రాష్ట్రంలో దీపం పథకం కింద అర్హులైన లబ్ధిదారులు 1.55 కోట్ల మంది ఉంటే, వారిని 90 లక్షలకే కుదించారు. అంటే ఎంత దారుణంగా ప్రజలను మోసం చేశారో అర్థం చేసుకోవాలి. దీనికి గానూ రూ.4వేల కోట్లు అవసరం అయితే కేవలం రూ.2601 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ పథకానికి తూట్లు పొడిచారు. సున్నావడ్డీ కింద పదిలక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్ ను చూస్తే రాష్ట్ర పాలన తిరోగమనంలోకి వెడుతోంది.
సంక్షేమానికి కేటాయింపులు ఏవీ?: బొమ్మీ ఇజ్రాయేల్, ఎమ్మెల్సీ
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు గానూ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఏ మేరకు కేటాయింపులు చేసిందో ఈ బడ్జెట్ లో స్పష్టత ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి. ఆర్భాటంగా రూ.3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అప్పులతో ముంచేసిందంటూ ఆరోపణల చేస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల నాటికే రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. వీటిని ఏ పథకానికి వినియోగించారు? ఎన్నికల్లో ప్రతి విద్యార్థికి రూ.15వేలచొప్పున తల్లికి వందనం ఇస్తామన్నారు. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా తక్కువగా కేటాయింపులు చేశారు. చేనేత కార్మికులు సంబంధించిన కేటాయింపులు లేవు. పేదల ఇళ్ళస్థలాలు, పక్కగృహాల పైనా ఎక్కడా కేటాయింపులు కనిపించలేదు. ఈ పాలనను ప్రశ్నిస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారు.
ఉద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ
గత ఏడాది ఎన్నికల సందర్బంగా ఉద్యోగులు, నిరుద్యోగులను కూటమి పార్టీలు హామీలతో ఆకట్టుకున్నారు. 2019లో జగన్ గారు ఉద్యోగులకు 29 శాతం ఐఆర్ ప్రకటించారు. 23 శాతం పీఆర్సీని ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మంచి ఐఆర్ ఇస్తామని, పీఆర్సీని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ లో ఐఆర్ ప్రకటిస్తారు, పీఆర్సీ కోసం కమిటీ వేస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఎక్కడ దానిపై ప్రస్తావన లేదు. నిరుద్యోగులకు సంబంధించి మెగా డీఎస్సీ అని ప్రకటించి, ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొత్త ఉద్యోగాల గురించి ఎక్కడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై కేటాయింపులు లేవు. విద్యార్ధులకు గత ఏడాదికి సంబంధించి మూడు క్వార్టర్ల బకాయిలను కూడా చెల్లించలేదు. ఇప్పటి వరకు ఆరు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో పెట్టారు. పరీక్షలు పూర్తవుతున్న నేపథ్యంలో బకాయిలు ఉన్నాయంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రాష్ట్రం అప్పుల పాలయ్యిందని గత ప్రభుత్వంపై నిందలు వేశారు. ఈ రోజు బడ్జెట్ లో జగన్ గారు 2023-24 లో కేవలం రూ.79 వేల కోట్లు మాత్రమే అప్పులు తీసుకువచ్చారని రాశారు. అన్ని పథకాలు అమలు చేసిన తరువాత కూడా చేసిన అప్పులు ఇవి. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు గానూ ఏ పథకాన్ని అమలు చేయకుండానే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.04 లక్షల కోట్లు అప్పులు చేస్తామని, గత ఏడాది రూ.98,576 కోట్లు అప్పులు చేశామని బడ్జెట్ లో ప్రకటించారు. బడ్జెట్ లోని డొల్లతనంపై సభలో నిలదీస్తాం.
3వ తేదీన వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు బయటపెడతాం
రాష్ట్రంలో వీసీల రాజీనామాలపై మంత్రి నారా లోకేష్ కు ఆధారాలు ఇస్తామని చెప్పాం. పంతొమ్మిది మంది వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు. మూడో తేదీన అన్ని ఆధారాలను సమర్పించబోతున్నాం. వీసీలు ఇచ్చిన రాజీనామాల్లో ఏపీ ప్రభుత్వం నుంచి సూచనలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నట్లు రాశారు. బలవంతంగా చేయించారనేది దానిని బట్టి అర్థమవుతోంది. వీసీల వద్దకు వెళ్లి టీడీపీ గుండాలు బెదిరించి రాజీనామాలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా సమర్పిస్తాం. ఈ ఘటనలపై మీడియాలో వచ్చి కథనాలు, వీడియోలను కూడా అందచేస్తాం. రెండు రోజుల్లో రాజీనామా చేయాలంటూ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. దీనిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి. వీసీలపై దాడులకు తెగబడిన వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు.