HomeNewsStock Market: అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన డీల్‌.. లాభాల బాట పట్టిన స్టాక్‌ మార్కెట్..!

Stock Market: అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన డీల్‌.. లాభాల బాట పట్టిన స్టాక్‌ మార్కెట్..!

Stock Market into Profits: గత కొంత కాలంగా నష్టాల బాట పట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దేశీయంగా రూపాయి విలువ బలపడడం, బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు మదుపర్లకు కలిసొచ్చింది. ఓ దశలో 600 పాయింట్లకు పైగా లాభాల బాట పట్టిన సెన్సెక్స్‌.. ఊగిసలాడుతూ చివరికి మోస్తరు లాభాలకే పరిమితమైంది. నిఫ్టీ 23,700 ఎగువన ముగిసింది. ఉదయం 75,260.39 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,183.36) లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 75,810.97 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఇక, ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 231.99 పాయింట్ల లాభంతో 75,415.35 వద్ద స్థిరపడింది. ఇక, నిఫ్టీ విషయానికి వస్తే.. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 64.60 పాయింట్ల లాభంతో 23,719.30 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 63 పైసలు బలపడి 95.73కు చేరుకోవడం మదుపర్లకు భారీ ఊరటనిచ్చింది.

- Advertisement -

Also read: YSRCP MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ రిజెక్ట్‌

లాభాల్లో ట్రేడైన షేర్లు ఇవే..

సెన్సెక్స్‌ 30 సూచీలో ట్రెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. అదే క్రమంలో సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బీఈఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర 105.07 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. ఔన్సు బంగారం 4532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఏదేమైనా, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గత కొంతకాలంగా వరుసగా పతనమవుతున్న షేర్లు వారాంతంలో కాస్త లాభపడం మదుపర్లకు ఊరటనిచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News