AUS vs IND: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy 2024) భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 252/9పరుగులు చేసింది. టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10), ఆకాశ్ దీప్ (27) పదో వికెట్‌కు 39 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. అంతకుముందు కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
రోహిత్ శర్మ (10), నితీశ్‌కుమార్ రెడ్డి (16), యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషభ్ పంత్ (9), సిరాజ్ (1) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఇక ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3.. జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్ చెరో వికెట్ తీశారు. వర్షం పలు మార్లు ఆటంకం కలిగించండంతో నాలుగో రోజు ఆటలో కూడా తక్కువ ఓవర్లే నమోదయ్యాయి.
కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది. మరి ఐదో రోజు ఆటలో భారత ఆటగాళ్లు ఎలా ఆడతారో దానిపై ఫలితం ఆధారపడి ఉంది. మరోవైపు వర్షం కూడా వరుసగా ఆటంకం కలిగిస్తుండంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.