Pending Bills Cleared: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. చాలా ఏళ్లపాటు పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ఒకేసారి క్లియర్ చేసింది. ఈ మేరకు మొత్తం రూ. 180.38 కోట్లను విడుదల చేసింది. దీంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది.
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ పెండింగ్ బిల్లులను విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల మెడికల్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇందుకు నిదర్శనమే గత ప్రభుత్వం హయాంలో 2023 మార్చి 4 నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గి, ఎంతో ఉపశమనం కలిగిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు వేస్తోంది. ఇటీవలె డీఏను సైతం రేవంత్‌రెడ్డి సర్కార్ పెంచింది. అయినా ఇంకా అనేక సమస్యలు ప్రభుత్వ ఉద్యోగులకు అపరిష్కారంగా ఉన్నట్లు ఉద్యోగస్థులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని ఉద్యోగ సంఘాలు తెలుపుతున్నాయి.