కొంతకాలం క్రితం వరకు బెంగళూరులోని మరగొండనహళ్లి చెరువు పక్క నుంచి వెళ్లాలంటే ముక్కు గట్టిగా రుమాలుతో మూసుకోవాల్సిందే. భరించలేని దుర్వాసన ఆ చెరువు నుంచి గాఢంగా వచ్చేది. జనం అటువైపు వెళ్లాలంటేనే ఎందుకొచ్చిందిరా భగవంతుడా అనుకునేవారు. కట్ చేస్తే…
ఇప్పుడు చుట్టుపక్కల అపార్టుమెంట్లలోని ప్రజలంతా ఎంచక్కా చెరువు చుట్టూ చేరి, ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు. చక్కగా అక్కడ చెరువుగట్టున కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు, సాయంత్రం పూట అక్కడకు వచ్చే పక్షులను చూసి, వాటి కిలకిలరావాలు విని మురిసిపోతున్నారు.
చేసిందెవరు?
ఈ చెరువు పునరుద్ధరణ వెనక ఉన్నది ఒక వ్యక్తి.. కాదు శక్తి. అతడే ఆనంద్ మల్లిగావడ్. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆనంద్.. ఆ తర్వాత చెరువుల మీద మనసు పారేసుకున్నారు. 2021లో మల్లిగావడ్ ఫౌండేషన్ మరగొండనహళ్లి చెరువును బాగుచేయాలని సంకల్పించింది. దానికి జేఎస్‌డబ్ల్యు గ్రూపు అండగా ముందుకొచ్చింది. కేవలం 75 రోజుల్లో.. స్టీలు గానీ కాంక్రీటు గానీ ఏమీ ఉపయోగించకుండా ఆ చెరువును బ్రహ్మాండంగా తయారుచేశారు.
ఇదెలా సాధ్యం?
చెరువును పునరుద్ధరించడానికి ఈ ఫౌండేషన్ 800 సంవత్సరాల నాటి టెక్నాలజీని ఉపయోగించింది. దాంతో చెరువు మొత్తం అద్దంలా మారింది. పర్యావరణానికి అత్యంత అనుకూలంగా తయారైంది. అంతకుముందు వరకు అక్కడ వినిపించని పక్షుల అరుపులు ఒక్కసారిగా వెలుగుచూశాయి. స్థానికులు, బెంగళూరు వాసులు అక్కడి అందాలను ఆస్వాదించగలుగుతున్నారు.
ఇంతకీ ఏం చేశారు?
“చెరువును పునరుద్ధరించడానికి చేసిన పనుల కోసం నేను ఎక్కువమంది కార్మికులను ఉపయోగించలేదు. చెరువు నిర్వహణకు ఎలాంటి ఖర్చు ఉండదు. పక్షులకు ఇబ్బంది కలగకూడదని.. విద్యుత్ లైట్లను కూడా ఏర్పాటు చేయలేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రజలు అక్కడ ఉండాలి. సాయంత్రం తర్వాత పక్షులకు ఆటంకం కలగకూడదు’’ అని ఆనంద్ వివరించారు. చెరువులో మురుగునీటిని శుద్ధి చేయడానికి తేలియాడే చిత్తడి నేలలను ఏర్పాటు చేశారు. ఇలాంటివి 10 ప్లాట్‌ఫాంలు అక్కడ పెట్టారు. ఇందుకోసం కాన్, వెటివర్ అనే నీటిలో పెరిగే రెండు రకాల మొక్కలను మొత్తం 12 వేల మొక్కలు ఉపయోగించారు. వీటి వేర్లు నీళ్లలో లోతుకంటే వెళ్లి, అందులోని మురికిని, కాలుష్య కారకాలను, విష పదార్థాలను శోషించుకుంటాయి. తద్వారా అవి సహజ ప్యూరిఫయర్లుగా పనిచేస్తాయి. ఇలాంటి కృత్రిమ చిత్తడి నేలలను ఫ్లోటింగ్ వెట్‌ల్యాండ్స్ అంటారు. దీంతో నీరు సహజంగా శుద్ధి అయ్యి.. ఎలాంటి వాసన, రంగు లేకుండా ఉంటుంది. అలాగే చెరువు చుట్టూ గట్టు మీద 4,500 మొక్కలను నాటి స్థానికులు కూడా చెరువు పునరుద్ధరణ ప్రాజెక్టుకు సహకరించారు. దాంతోపాటు, చెరువులో పూడికతీసిన మట్టితోనే చుట్టూ ఒక గట్టులా కట్టి, భవిష్యత్తులో మళ్లీ కాలుష్య కారకాలు చెరువులోకి ప్రవేశించకుండా కాపాడారు.
ఇదొక్కటే కాదు.. ఆనంద్ మల్లిగావడ్ అనే ఈ 40 ఏళ్ల యువకుడి చేతుల మీదుగా ఇప్పటివరకు 360 హెక్టార్ల పరిధిలో ఉన్న 80 చెరువులను ఇలాగే కాపాడారు! అందుకే ఆనంద్‌ను అందరూ లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
ఆనంద్ ముందుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. తర్వాత చెరువుల మీద మనసు పారేసుకుని, చెరువుల పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. ముందుగా సన్సేరా ఫౌండేషన్‌లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) విభాగానికి అధిపతిగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమాల్లో భాగంగా చెరువుల శుద్ధి పనులు మొదలుపెట్టినప్పుడు ఆయనకీ ఆలోచన వచ్చింది. తర్వాత క్రమంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి, చెరువులను కాపాడడమే తన పూర్తిస్థాయి పనిగా చేస్తున్నారు. ముందుగా బెంగళూరుకు, తర్వాత భారతదేశం మొత్తానికి అత్యద్భుతమైన చిత్తడినేలలు అందించాలన్నది ఆనంద్ కల. నిజానికి ఒక్క భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండం మొత్తంలో ఆనంద్ పేరు ఇప్పటికే మార్మోగిపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల నుంచి ఆయనకు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అలాగని ఇదేమీ నల్లేరుమీద బండి నడక లాంటిది కాదు. పరిపాలనాపరమైన అడ్డంకుల నుంచి ల్యాండ్ మాఫియా బెదిరింపుల వరకు అన్నింటినీ ఎదుర్కోవాల్సి వచ్చింది. నిధుల సేకరణ మరో పెద్ద సమస్య. ప్రజల నమ్మకం పొందడం తొలినాళ్లలో ఇంకా కష్టం అయ్యేది. తానెవరన్నది వారికి తెలియనప్పుడు.. తన పని చూపించడం ఒక్కటే మార్గం. అది కూడా పూర్తయిన తర్వాత గానీ ఫలితాలు కనిపించవు. ఇలా ఆనంద్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. అయినా మనోధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా తన నైపుణ్యాలు, సామర్థ్యం, చేస్తున్న పని, అన్నింటికంటే.. తాను ఎంచుకున్న ఆశయసిద్ధి కోసం అలా కష్టపడుతూనే వచ్చారు.
2019లో కంపెనీల చట్టం కింద మల్లిగావడ్ ఫౌండేషన్‌ను ఆయన స్థాపించారు. జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా పని మొదలుపెట్టారు. చెరువులను వీలైనంత వరకు సహజ పద్ధతిలోనే పునరుద్ధరిస్తున్నారు. చెరువులు స్వయంసమృద్ధిగా ఉండాలని, అక్కడ భావితరాల కోసం పర్యావరణ, జీవావరణ వ్యవస్థ బాగుండాలని ఆశయం పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో మాత్రమే పెరిగే మొక్కలను ఎంచుకుంటారు. స్థానికులందరినీ కూడా ఈ పనిలో భాగం చేస్తారు. దానివల్ల వారందరికీ కూడా చెరువులు, వాటి పర్యావరణ వ్యవస్థ మీద అవగాహన కలుగుతుంది. స్వయంగా చేయడంతో పాటు, మరో పదిమందికి ఈ చెరువుల పునరుద్ధరణ పనుల గురించి చెబుతున్నారు. వారిలో కొందరైనా ముందుకొస్తే.. దేశంలో చెరువులన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దగలమన్నది ఆనంద్ మల్లిగావడ్ విశ్వాసం.
ఎలా మొదలైందీ ప్రస్థానం?
భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరు నగరంలో తాగడానికి చుక్క నీరు కూడా ఉండకపోవచ్చంటూ పలువురు పర్యావరణవేత్తలు హెచ్చరించిన తరుణంలో.. ప్రస్తుతం ఇప్పటికే అక్కడున్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఈ సమస్య ఉండదు కదా అన్న ఆలోచన మెకానికల్ ఇంజినీర్ అయిన ఆనంద్ మల్లిగావడ్‌కు వచ్చింది. బెంగళూరు నగరంలో పురాతన కాలం నుంచి ఉన్న చెరువుల వ్యవస్థ ఆ నగరానికి కావల్సినన్ని మంచినీళ్లు అందించేది. కానీ క్రమంగా అది భారత సిలికాన్ వ్యాలీగా మారే క్రమంలో చాలావరకు చెరువులను పూడ్చేసి ఆకాశ హర్మ్యాలు నిర్మించారు. మిగిలిన చెరువుల్లోకి నగరంలో అన్ని ప్రాంతాల నుంచి వ్యర్థాలు ప్రవహించాయి. దాంతో చెరువులన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. అటువైపు వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించేవారు కారు. ముక్కుపుటాలు బద్దలయ్యేలా దుర్వాసన వాటి నుంచి వచ్చేది. కొన్నింటినైతే పూడ్చేసి డంప్ యార్డులుగా కూడా మార్చేశారు. దీంతో ఆనంద్‌లో ఆలోచన మొదలైంది.
“చెరువులు అనేవి ఈ భూమికి ఊపిరితిత్తుల్లాంటివి. మీ దగ్గర డబ్బులుంటే.. వాటిని చెరువుల రక్షణకు ఉపయోగించండి. కొన్ని దశాబ్దాల పాటు అవి మీకు లెక్కలేనంతగా సేవలందిస్తాయి. తాగునీరు ఇస్తాయి, మంచి గాలిని ఇస్తాయి, మనసుకు ఆహ్లాదం పంచుతాయి, నేత్రపర్వంగా ఉంటాయి’’ అని ఆనంద్ చెబుతుంటారు.
నీటికొరత అనేది దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సమస్యగా మారిపోతోంది. ప్రపంచంలోని మొత్తం జనాభాలో దాదాపు ఐదోవంతు ఇక్కడే ఉందిగానీ, మొత్తం జలవనరుల్లో కేవలం 4% మాత్రమే మన దేశంలో ఉన్నాయి.
ఆనంద్ ముందుగా రోజూ తాను ఆఫీసుకు వెళ్లే మార్గంలో చెత్తతో నింపేసి, బాగా ఎండిపోయిన ఓ ప్రాంతం మీద దృష్టిపెట్టాడు. ఎవరికో స్ఫూర్తినిచ్చేందుకు బదులు ముందుగా తానే పనిచేయాలని అనుకున్నాడు. చోళుల కాలంలో.. అంటే కొన్ని శతాబ్దాలకు ముందు లోతట్టు ప్రాంతాలన్నింటినీ రిజర్వాయర్లుగా మార్చి, ప్రజలకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందించిన టెక్నాలజీ గురించి అధ్యయనం చేశాడు. అప్పట్లో భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు నిండి, చుట్టుపక్కల భూగర్భజలాలు కూడా బాగా వృద్ధిచెందేవి. ఒకప్పుడు బెంగళూరులో 1850 చెరువులు ఉండగా.. ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే 450 కూడా లేవు. దాంతో ఉన్నవాటిని ముందుగా కాపాడడంతో పాటు, అదృశ్యం అయిపోయిన చెరువులకు మళ్లీ ప్రాణం పోయాలని భావించాడు ఆనంద్. ముందుగా దాదాపు 180 చెరువుల వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఆ చెరువులు రూపొందించడానికి ఏమాత్రం పెద్దగా ఖర్చు కాలేదని, కేవలం మట్టి, నీరు, కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయని గుర్తించాడు. 2017లో తాను పనిచేస్తున్న కంపెనీ సీఎస్ఆర్ నిధుల్లోంచి దాదాపు రూ.60 లక్షలు కేటాయించేలా వారిని ఒప్పించి, దాంతో దాదాపు 36 ఎకరాల పరిధిలో ఉన్న క్యాలాసనహళ్లి చెరువు పునరుద్ధరణకు నడుంకట్టాడు. పొక్లెయిన్ల సాయంతో 45 రోజుల్లో ముందుగా చెరువుకు పూర్వరూపం తీసుకొచ్చారు. కొన్ని నెలల తర్వాత వర్షాలు పడి.. చెరువు నిండింది. ఆ నీళ్లలో వారంతా కలిసి బోటింగ్ కూడా చేశారు.
అంతా ప్రకృతి సిద్ధంగానే…
చెరువుల పునరుద్ధరణ విధానం చాలా సాధారణంగానే ఉంటుందని మల్లిగావడ్ చెబుతారు. ముందుగా చెరువులో మురుగునీటిని తొలగించి, దాంతోపాటు పూడిక, గుర్రపుడెక్క లాంటివన్నీ తీసేస్తారు. తర్వాత గట్టును పటిష్ఠం చేస్తారు. ఆ ప్రాంతంలో సహజంగా ఏయే రకాల మొక్కలు పెరుగుతాయో వాటిని, నీళ్లలో పెరుగుతూ నీటిని శుభ్రం చేసే మొక్కలు అక్కడ సిద్ధం చేస్తారు. అందులో నీళ్లు మనం నింపక్కర్లేదు. అన్నీ సహజంగానే వస్తాయి. సహజంగానే పర్యావరణం అక్కడ రూపుదిద్దుకుంటుంది. ఇలా మొదట ఒకటి రెండు చెరువులు చేసిన తర్వాత.. దాన్నే పూర్తి పనిగా పెట్టుకోవాలని భావించాడు. ఇందుకు ఎక్కువగా వివిధ కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచే సేకరించేవాడు. అలా ఇప్పటివరకు దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లోని 80 చెరువులను ఇప్పటివరకు పునరుద్ధరించాడు.
పిల్లలు హాయిగా వచ్చి ఈ చెరువుల్లో ఈత కొడుతూ ఆస్వాదిస్తున్నారని.. ఇంతకంటే మన జీవితానికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుందని ఆనంద్ అంటాడు.
హైదరాబాద్‌కూ సేవలు
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ కోసం ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు పనులు చేపడుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రాకు ఆనంద్ మల్లిగవాడ్ తన సేవలు అందించడానికి సిద్ధమయ్యారు. చెరువుల ప్రక్షాళన, వాటి సంరక్షణపై చర్చించేందుకు ముందుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో ఇటీవలే ఆనంద్ వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఇప్పటివరకు తాను బెంగళూరు, ఇతర నగరాల్లో ఎక్కడెక్కడ ఏయే చెరువులను ఎలా పరిరక్షించిందీ రంగనాథ్‌కు ఒక వీడియో ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. దాంతో.. ఇప్పటివరకు ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో ఉన్న సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్ పల్లి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని రంగనాథ్ భావిస్తున్నారు. సహజమైన పద్ధతిలోనే ఈ పని చేపట్టేందుకు ఆనంద్ ముందుకొచ్చారు. త్వరలోనే ఆనంద్ సేవలతో నగరంలోని కొన్ని చెరువులు శుభ్రం అవుతాయని ఆశిద్దాం.