ఒంటిమిట్ట(Ontimitta) శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్బంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ పేర్కొన్నారు. రెండు వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్.పిలు, 25 మంది డి.ఎస్.పి లు, 73 మంది సి.ఐ లు, 177 మంది ఎస్.ఐ లు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారని ఎస్.పి తెలిపారు.
బుధవారం కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా ఎస్పీ బందోబస్తు విధుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ఏ.ఆర్ సిబ్బందికి బందోబస్తు ప్రణాళిక పై దిశా నిర్దేశం చేశారు. శ్రీ సీతారాముల కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రించాలన్నారు.

శ్రీ కోదండ రామాలయం, కళ్యాణ వేదిక, పార్కింగ్, టి.టి.డి గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. గ్యాలరీ, వి.వి.ఐ.పి ప్రవేశ మార్గం, వి.ఐ.పి ప్రవేశ మార్గం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తత తో ఉండాలన్నారు. బాంబు డిస్పోజల్ టీమ్, స్పెషల్ పార్టీ సిబ్బందికి జిల్లా ఎస్.పి పలు సూచనలు చేశారు. సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఎండ వేడిమి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భద్రత పర్యవేక్షించేలా పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి దిశా నిర్దేశం చేశారు.

అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) శ్రీ బి.రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి కె.శ్రీనివాస రావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.ఐ లు ఆనంద్, వీరేష్, శివరాముడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు