Tuesday, January 14, 2025
HomeNewsTirupathi: కోడెగిత్తల జోరు, యువకుల హుషారు

Tirupathi: కోడెగిత్తల జోరు, యువకుల హుషారు

అనుప్పల్లెలో వేడుకగా జల్లికట్టు

పట్టుకో.. పట్టుకో.. దమ్ముంటే నా కోడె గిత్తలను పట్టుకోండి అంటూ.. రైతులు పశువుల పండుగలో భాగంగా అనుపల్లెలో జల్లికట్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని అనుప్పల్లె గ్రామంలో సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ జల్లికట్టు ప్రారంభమైంది.

- Advertisement -

కొమ్ములకు వేల రూపాయలు కట్టి

అనుపల్లె గ్రామంలో యువకుల జోరుతో జల్లికట్టు హుషారుగా సాగింది. గ్రామంలో రైతు కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటున్న కోడెగిత్తలు, ఆవులను రైతులు వాటి కొమ్ములను నున్నగా చెక్కి కొమ్ములకు రంగులు పూసి వాటిని శుభ్రంగా కడిగి పూజించారు. కోడెగిత్తల కొమ్ములకు చెక్క పలకలు, నూతన వస్త్రాలు, వేలాది రూపాయల పారితోషికంగా నగదును కట్టి, నా కోడిగిత్తల పౌరషాన్ని చూడండి అంటూ వాటి యజమానులు మీ వల్ల అయితే పట్టుకోండి చూద్దాం అంటూ యువతకు సవాళ్లు విసిరారు. కోడెగిత్తల కొమ్ములకు బంగారు, వెండి ఆభరణాలు , అభిమాన, రాజకీయ, సినీ నటుల ఫోటోలతో కూడిన చెక్క పలకలను కొమ్ములకు కట్టి దొడ్లో నుంచి పందేళ్ళ బరిలోకి దించి, కోడెగిత్తలను వాయిద్యాలు కొడుతూ బెదిరించి పరుగులు చేయించారు.

గుంపులు గుంపులుగా చేరి

ఉదయం 10 గంటలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువత గుంపులు గుంపులుగా చేరి పశువులకు కట్టిన బంగారు వెండి ఆభరణాలు, నగదు, పలకలను చేజిక్కించుకునేందుకు పోటీపడ్డారు. పశువుల పాక నుండి బరిలోకి దించి కోడెగిత్తలు వెనక డప్పులు వాయిస్తూ వాటిని బెదరకొట్టగా అవి బెదిరి దూకుడుగా పరిగెత్తుతుండగా యువకులు పౌరుషంతో పశువులు, కోడిగిత్తల పట్టుకునేందుకు పోటీపడ్డారు. గిత్తలను పట్టుకుని చేజిక్కించుకున్న బహుమతులను ప్రేక్షకులకు చూపిస్తూ నేనే విజేతని అంటూ యువకులు కేరింతలు వేశారు.

భారీగా జనసందోహం

ఈ పోటీలలో కోడెగిత్తలు బెదిరి పరుగుతో ముందుకు వెళ్తున్న వాటిని నిలువరించేందుకు చేసే క్రమంలో చెదురు మదురు సంఘటనలో కొంతమంది యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ పౌరుష పందాలను తిలకించేందుకు విచ్చేసిన జనాలతో అనుపల్లి గ్రామం జనసంద్రమైంది. కోడి గిత్తల కొమ్ములకు పశువుల యజమానులు తమ అభిమాన రాజకీయ నాయకుల ఫోటోలు పార్టీ జెండాలతో చెక్క పలకను విశేషంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ పందాలను తిలకించేందుకు దేశ విదేశాల నుండి, తెలంగాణ తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారు.

ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయనే సెంటిమెంట్

తమ గిత్తలను ఇలా జల్లికట్టులో వదలడం ద్వారా పంటలు బాగా పండుతాయి అని, సిరి సంపదలు కలుగుతాయని ఇక్కడే రైతుల ప్రగాఢ విశ్వాసం. ఆనంపల్లిలో జరిగిన జల్లికట్టులో యువత కేరింతల కొడుతూ మత్తులో మునిగితేలి సరదాగా గడిపారు. పందాలకు విచ్చేసిన ప్రేక్షకులకు గ్రామానికి చెందిన తారాసి యశ్వంత్, బొడ్డు ముని ప్రసాద్ లు 5000 మందికి ఆహార సదుపాయం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News