Friday, November 22, 2024
HomeNewsTomato prices rising: మరో నెల రోజులు టమేటా పరిస్థితి ఇంతే

Tomato prices rising: మరో నెల రోజులు టమేటా పరిస్థితి ఇంతే

మరో నెల రోజులపాటు టమోట ధరలు ఇంతే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణలో కూడా టమేటా ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. మున్ముందు కిలో టమేటా ధర 200 రూపాయలు దాటిపోయే అవకాశం కూడా ఉందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. టమేటా ధర ఈ విధంగా పెరిగిపోవడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకే కాక,
తెలంగాణ ప్రాంతాలకు కూడా టమేటా సరఫరా అవుతుంటుంది. గత జూన్ 25న కిలో వంద రూపాయలతో ప్రారంభమైన టమేటా ధర ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఇప్పుడు 150 రూపాయల పైచిలుకే పలుకుతోంది.

- Advertisement -

కాగా, యాభై రోజులకు మించి టమేటా ధర కిలో100 రూపాయలు దాటి ఉండడం అరుదైన విషయం. పైగా, జూన్, జూలై నెలలో టమేటా ధర పెరగడం కూడా అధికారులకు వింతగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ రెండు నెలల్లో టమేటా ధర దారుణంగా పడిపోతూ ఉంటుంది. గత ఏడాది జూలై 1 నుంచి జూలై 31 వరకు టమేటా ధర కిలో 60 నుంచి 20 రూపాయలకు పడిపోవడం జరిగింది. కానీ, జూన్ మధ్య నుంచే టమేటా ధర కిలో 40 రూపాయల నుంచి ఎకాయెకిన 150 రూపాయలు దాటిపోయింది. గత అయిదేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఏర్పడలేదు. ఈ సీజన్ లో ఇలా జరగడం అసాధారణంగా ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

గత ఏడాది ఇదే కాలంలో టమేటా ధర దారుణంగా పడిపోవడానికి కారణం మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మరికొన్ని రాష్ట్రాల నుంచి టమేటాను దిగుమతి చేసుకోవడమే. అయితే, ఈసారి ధరలు పెరగడానికి కారణం ఆ రా‌ష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడమేనని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆ రాష్ట్రాలలో భారీ వర్షాల వల్ల టమేటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలో టమేటా దిగుబడి చాలా తక్కువ. అందువల్ల ఈ రాష్ట్రం మదనపల్లె మార్కెట్ మీద ఎక్కువగా ఆధారపడుతుంటుంది. అందువల్లే ఈ రాష్ట్రంలో టమేటా ధర ఆకాశా న్నంటి, జనం అవస్థలు పడడం జరుగుతోందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వివరిస్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్ కు ఈ ఏడాది జూన్ లో ఇతర ప్రాంతాల నుంచి 35 శాతం దిగుమతి పెరిగింది. ఫలితంగా ధరలు అదుపులో, అందుబాటులో ఉన్నాయి. జూన్ నాటికి అది 85 శాతానికి చేరుకుంది. దీనివల్ల ప్రజలకు ఎటువంటి సమస్యా, కొరతా ఏర్పడలేదు. అయితే, ఆ తర్వాత టమేటా దిగుమతి ఏకంగా 20 శాతానికి తగ్గిపోయింది. మదనపల్లె నుంచి దిగుమతులు చాలా తక్కువకు పడిపోవడం వల్ల
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టయింది. అయితే, ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం మార్కెట్ ఆదుకుంటూ ఉంటుంది. కొద్ది రోజుల్లో అనంతపురం నుంచి సరఫరాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది అనంతపురంలో సాధారణ వర్షాలు పడినందువల్ల టమేటా దిగుబడి కూడా అభిలషణీయ స్థాయిలో ఉంది. అందువల్ల మరో 15 రోజుల్లో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలకే కాక, తెలంగాణ ప్రాంతాలకు కూడా టమేటా సరఫరా అయ్యే సూచనలున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తట్టుకోగలిగిన స్థాయికి టమేటా ధరలు తగ్గడానికి పదిహేను రోజుల నుంచి నెల రోజుల కాలం పడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ వెరైటీల టమేటా సరఫరా అవుతుంది. ఈలోగా అనంతపురం నుంచి టమేటాలు దిగుమతి అయ్యేవరకూ ధర పెరగడం అనేది తప్పదు. ఆ తర్వాత పరిస్థితిలో కొద్దిగా మార్పు వస్తుంది. మొత్తం మీద నెల రోజులకు గానీ ధరల స్థిరీకరణ జరగకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News