రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహ విద్యార్థుల కోసం చక్కటి కామన్ డైట్ మెనూ అమల్లోకి తెచ్చిందని మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఉద్యాన శాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండి షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారులు బాలికల వసతి గృహాల్లో బస చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చేసిన సూచన మేరకు వనపర్తి జిల్లాకు ప్రత్యేక అధికారిగా మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించి రాత్రి అక్కడే బస చేశారు. గురువారం ఉదయాన్నే విద్యార్థులతో కలిసి ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలకు వచ్చిన స్థానిక శాసనసభ్యులు తూడి మెగా రెడ్డితో కలిసి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
హాస్టల్ లో ఐఏఎస్ వుమెన్ ఆఫీసర్స్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి, కామన్ డైట్ మెనూ అమలు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ ఐఏఎస్ మహిళా అధికారులను బాలికల వసతి గృహాల్లో బస చేసేందుకు ప్రత్యేకంగా పంపిస్తుందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు 40 శాతం మెస్ చార్జీలు, దాదాపు 200 శాతం కాస్మటిక్ చార్జీలు ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. పాఠశాలలో, వసతి గృహంలో మంచి సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడ సిబ్బంది తమ దృష్టికి తెచ్చిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.అనంతరం, జిల్లా కేంద్రంలో కేడిఆర్ నగర్ లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మెనూపై ఆరా
కళాశాల వసతి గృహంలోని కిచెన్ ను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. వంట సామాగ్రి నిల్వకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థిలతో కాసేపు సంభాషించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ గురించి ఆరా తీశారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆఫ్జాలుద్దీన్, మైనారిటీ కళాశాల ప్రిన్సిపల్ హవిలా రాణి, ఉద్యాన శాఖ అధికారులు, గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ సరస్వతి పాల్గొన్నారు.