Vidya Balan: నటీనటులకు కొన్ని పాత్రలలో నటించాలన్న కలలు ఉంటాయి. ఒక్కోసారి అవి కలగానే ఉండిపోతుంటాయి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ చిత్రంలో నటించాలన్నది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు ఓ కల. అయితే ఆ కల కలగానే మిగిలిపోయిందని ఓ ఇంటర్వ్యూ లో విద్యాబాలన్ బాధను వ్యక్తంచేశారు. దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలైన దివంగత ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రను పోషించేందుకు తనకు పలు అవకాశాలు వచ్చాయని, అయితే ఆ ప్రాజెక్ట్ ఏవీ పట్టాలెక్కలేదని ఆమె ఈ సందర్భంగా వివరించారు.
“దాదాపు 12 ఏళ్ల క్రితమే రాజీవ్ మీనన్‌తో కలిసి ఎం.ఎస్.సుబ్బులక్ష్మిపై ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ చిత్రంపై స్టే ఆర్డర్ రావడంతో మేము ముందుకు వెళ్లలేకపోయాం. ఎం.ఎస్. పాత్రను పోషించాలని నేను ఎంతో వాంఛించాను కాబట్టి నా మనసు ఎంతో బాధకు గురైంది” అని ఆమె పేర్కొన్నారు. ఆ మహా గాయని గళం ప్రతిరోజూ ఉదయాన్నే తాను వినే మొదటి శబ్దమని, తమ కుటుంబ సభ్యులందరూ ఆ గాయని ఆలపించిన ‘సుప్రభాతం’ వింటూనే నిద్రలేస్తామని ఆమె తెలిపారు. ఆ దిగ్గజ గాయని జీవితం గురించి తనకు ఎంతో తెలుసని, రాజీవ్ మీనన్ చాలా చక్కని స్క్రిప్ట్ రాశారని ఆమె పేర్కొంటూ…అయితే కోర్టు స్టే ఆర్డర్ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయిందని చెప్పారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర కోసం 2024లో ఒక ఫొటో షూట్ చేశానని, ఆ తర్వాత కొందరు చిత్ర నిర్మాతలు ఆ బయోపిక్ తీయాలని ఆసక్తి చూపారని విద్యాబాలన్ వెల్లడించారు.
ఆ ఫొటో షూట్ బయటకు వచ్చిన తర్వాత, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నటించేందుకు తనకు ఏడు చిత్రాల నుంచి ఆఫర్లు వచ్చాయని, ఆ సినిమాకు అవసరమైన అనుమతులు లభిస్తేనే తాను నటిస్తానని వారితో చెప్పానని ఆమె వివరించారు. అలా చాలాకాలంగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర చేయాలన్న తన కల కలగానే ఉండిపోయిందని ఆమె తెలిపారు. ఇదిలావుండగా, ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే చిత్రంలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న టైటిల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఊహించనివిధంగా రష్మికకు ఆ అవకాశం లభించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

