దేశంలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 2018 తర్వాత భారతదేశంలో ఇంతగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడలేదనే చెప్పాలి. గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అంటే వర్షాకాలంలో దేశంలో నమోదైన వర్షపాతం 82 సెంటీమీటర్లు మాత్రమే. సాధారణ వర్షపాతం 89 సెంటీమీటర్లు కాగా ఈ ఏడాది దానికికూడా 6 తక్కువగా వర్షపాతం నమోదైంది. ఎల్ నీనో వాతావరణం కారణంగా దేశంలో తక్కువగా వర్షపాతం నమోదవుతుందనే విషయం గత ఏప్రిల్ లోనే అర్థమైపోయింది. ఎన్ నీనో పేరుతో పసిఫిక్ మహాసముద్రం మీద వేడి గాలులు వ్యాపిస్తున్నందువల్ల దీని ప్రభావం భారతదేశం తప్పకుండా కనిపిస్తోంది. ముఖ్యంగా వాయవ్య భారతంమీద దీని దుష్ప్రభావం దారుణంగా ఉంటోంది. 2019 నుంచి 2022 వరకు ఎల్ నీనా పేరుతో చల్లగాలులు వీచడం వల్ల దేశంలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయింది. మొత్తం మీద ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే బాగా తక్కువగా వర్షపాతం నమోదు కావడం జరిగింది.
విచిత్రమేమింటే, దేశంలో ఈఏడాది వర్షపాతం అస్తవ్యస్తంగా కూడా ఉంది. దేశంలో కొన్ని ప్రాంతాలలో 9 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాలలో 18 శాతం లోటు వర్షపాతం కూడా నమోదైంది. సాధారణంగా వర్షాలు ఎక్కువగా కురిసే ఆగస్టు నెలలో అనేక ప్రాంతాలు అధిక వర్షాలను చవిచూడగా, మరికొన్ని ప్రాంతాల్లో నీటి చుక్క కూడా పడని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని అత్యధిక ప్రాంతాలలో ఆగస్టు నెలలో సాధారణం కంటే మూడు వంతులు తక్కువగా కూడా వర్షాలు పడడం జరిగింది. చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలలో జూలై నుంచి వర్షాలు పడడం ప్రారంభమై, ఆ రాష్ట్రాలు వరదలు, తుఫానుల్లో చిక్కుకోవడం, నీట మునిగిపోవడం కూడా జరిగింది. ఈ రాష్ట్రాలలోని నగరాలు అనేక రోజుల పాటు నీట మునిగే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టులో దాదాపు తుఫాను పరిస్థితి ఏర్పడింది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడడం కూడా జరిగింది. వర్షాకాలంతో పాటు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పుల వల్ల ఈ విధంగా ఈ రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, వర్షాలు పెరగడానికి, తగ్గడానికి కూడా వాతావరణ మార్పులు కారణమవుతున్నాయి.
కొన్ని రాష్ట్రాలలో తీవ్రస్థాయిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం కూడా గమనించాల్సిన విషయం. ఈ ఏడాది వర్షపాతానికి సంబంధించినంత వరకూ మహారాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందనే చెప్పవచ్చు. కొద్ది తేడాతో చత్తీస్‌గఢ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలను కూడా ఇదే కోవలో చేర్చాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులకు తోడు కర్ణాటకలో కావేరీ నదీ జలాల సమస్య కూడా తలెత్తింది. కావేరీ నదీ జలాల పంపకం విషయంలో ఈ రాష్ట్రానికి, తమిళనాడుకు ఉన్న వివాదం మళ్లీ భగ్గుమంది. ఇది ఇలా ఉండగా, అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య ఈశాన్య రుతు పవనాల కారణంగా సాధారణం నుంచి ఒకమోస్తరు వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వాయవ్య భారతదేశంలోనూ, దక్షిణ భారతదేశంలోనూ కాస్తంత ఎక్కువగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అది తెలిపింది.
మొత్తం మీద వాతావరణ మార్పులను, వర్షపాత ఎగుడు దిగుడులను మనసులో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాలే కాకుండా, నగర, పట్టణ ప్రాంతాలకు కూడా రక్షణ కవచం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ ఏర్పడకుండా భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు వీటికి తట్టుకునే విధంగా తగిన ప్రాథమిక సదుపాయాలను నిర్మించాల్సి ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడినా, తక్కువ పడినా ప్రజలు, వ్యవస్థలు కష్టనష్టాలకు లోనుకాకుండా, ముందు జాగ్రత్త చర్యలు అనేకం తీసుకోవాల్సి ఉంటుంది. భారతీయ వర్షాకాలంలోని తీవ్రస్థాయి మార్పులను ముందే పసిగట్టగల వ్యవస్థలను నిర్మించుకోవడంతో పాటు, ఈ వర్షపాత పరిస్థితులను కనీసం రెండు మూడు వారాల ముందే ప్రజలకు చేరవేసే విధానాలను, ఆధునిక వాతావరణ హెచ్చరిక పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇందుకు మరిన్ని నిధులు, నైపుణ్యాలను మళ్లించాల్సిన అవసరం ఉంది.
Weather report plays a key role: వాతావరణం నుంచి రక్షణ అవసరం
ఆధునిక వాతావరణ హెచ్చరికలు అత్యవసరం