జగన్ ఓటమికి కారణాలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి. మొదటిది పాదయాత్ర తరువాత జగన్ ప్రజల్లోకి వెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలు తప్పితే ఆయన ప్రజల్లో వచ్చింది, కనపడింది ఈ ఐదేళ్లలో లేనేలేవని చెప్పాలి. ఆఖరుకి ప్రచార సమయానికి తప్పితే జగన్ ప్రజలకు దర్శనం ఇచ్చింది చాలా అపురూపం. ఎప్పుడూ తన అధికార నివాసానికి జగన్ పరిమితమయ్యారని ప్రజలు ఎప్పటినుంచో బాహాటంగా విమర్శిస్తున్నా జగన్ పట్టించుకోలేదు.
ఇక వైసీపీ పార్టీ గురించి చెప్పాలంటే జగన్ పార్టీలో అన్నీ తానే అన్నిటా తానే. ఇది జస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు ఆయన వ్యవహారశైలి ఉంటుంది. జగన్ వ్యవహారశైలి పార్టీలో సీనియర్లకే కొరుకుడుపడదనేది బహిరంగ రహస్యం. కానీ జగన్ ఎన్నడూ పార్టీ నేతలతో పార్టీ భవిష్యత్ గురించి ఆయన చర్చించింది లేదు, వారి ఫీడ్ బ్యాక్ లేదా సలహాలు తీసుకున్నపాపాన పోరని పార్టీలో పెద్ద టాక్ ఎప్పటినుంచో ఉంది.
సజ్జల రామకృష్ణారెడ్డి లేదా విజయ సాయి రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే జగన్ అత్యధికంగా ఆధారపడింది మాత్రం ఆయన ధనుంజయ్ రెడ్డి మీదే అని వైసీపీ నేతలు చెబుతూనే ఉంటారు. వీరు ముగ్గురే ఆయనకు ఆంతరంగిక సలహాదారులు. ఇక తన బంధువు కూడా అయిన పెద్ది రెడ్డి వంటి కొందరు జగన్ ఇంటర్నల్ కోటరీలో కీలక వ్యక్తులుగా చక్రం తిప్పుతూవచ్చారు.
కార్యకర్తలకు కనపడని, వినపడని నేతగా జగన్ మారారు. నియంతృత్వ ధోరణితో జగన్ వ్యవహరిస్తారని పార్టీలోని సాధారణ కార్యకర్తలు మొత్తుకుంటున్నా పార్టీ నేతలు చేయగలిగింది ఏమీ లేకపోగా, జగన్ ఇలాంటి క్షేత్రస్థాయి విషయాలను ఎన్నడూ కేర్ చేయలేదు. జగన్ ఎందుకు ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శించటం జగన్ నైజంగా మారిపోయింది.
ఇక పార్టీ నేతల సంగతి ఇలా ఉంటే మిగిలింది మీడియా. ఎప్పుడూ మీడియాకు అందుబాటులో ఉండని సీఎంగా, పార్టీ పెద్దగా జగన్ వ్యవహరించటంలో ఉన్న రహస్యం ఎవరికీ అంతుచిక్కదు. అసలెందుకు మీడియాకు సీఎం అందుబాటులో ఉండరు. ప్రెస్ మీట్లు పెట్టరు, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలకు అందరు, ఆఖరుకి అపాయింట్మెంట్లు సైతం ఇవ్వరు. ప్రజా నేత, జననేత అని పదేపదే పిలిపించుకునే నేత అయిన జగన్ ప్రజలకు-తనకు మధ్య ఉన్న అనుసంధానకర్త అయిన మీడియాపై ఈ నిర్లక్ష్య వైఖరిని తొలి నుంచీ ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నది ఓ పజిల్ గా మారింది. ఒకవైపు ప్రధాని మోడీ సహా ప్రముఖ సెలబ్రేటెడ్ లీడర్సంతా మెయిన్ స్ట్రీమ్ మీడియాకే కాదు ఏకంగా యూట్యూబ్ ఛానెల్స్, బ్లాగర్ల్, వ్లాగర్స్, ఇన్ఫ్ల్యూయెన్సర్లకు పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తుంటే జగన్ మాత్రం ప్రధాన మీడియా హౌసులకు మాత్రమే ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఐదేళ్లపాటు మీడియాకు దూరంగా ఉండిపోవటం విడ్డూరం. ప్రాంతీయ పార్టీ అయినా ప్రాంతీయ మీడియా అంటే పూచికపుల్ల అంత విలువ కూడా జగన్ ఇవ్వరనేది అతిపెద్ద విమర్శ. ప్రాంతీయ పార్టీలు తమ అజెండాను ప్రజలకు డైరెక్ట్ గా తీసుకెళ్లే ప్రధాన వేదిక, ప్రధాన గొంతుక ప్రాంతీయ మీడియానే అంతటి బలమైన సాధనాన్ని జగన్ విస్మరించారు. మరోవైపు టీడీపీ, జనసేన ఇదే ప్రాంతీయ మీడియాను విస్తృతంగా వాడుకుంది, ప్రసార సాధనాలను ప్రచార సాధనాలుగా మార్చేసుకుని, తమ వాయిస్ ను బలంగా ప్రజలకు చేరవేర్చటంలోనే అసలు రహస్యం దాగుంది.
చుట్టూ జర్నలిస్టులే సలహాదారులు, సూచనకర్తలను పెట్టుకున్న జగన్ మీడియాతో మాత్రం మాట్లాడకపోవటం ఏంటి. సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ సీనియర్మోస్ట్ జర్నలిస్టు, ఆయన సలహాదారుల్లో ఉన్నవారంతా దేవులపల్లి అమర్ సహా అత్యధికులు జర్నలిస్టులే కానీ జర్నలిస్టులను జగన్ దగ్గరికి రానియ్యరు. అడపాదడపా భారీ ప్యాకేజీలు ఇచ్చి నేషనల్ మీడియాకు మాత్రమే స్పాన్సర్డ్ ప్రోగ్రాంలా ఇంటర్వ్యూలు ఇవ్వటం అంటే జగన్ కు క్రేజ్ ఎక్కువ అని వైసీపీ బీట్ రిపోర్టర్స్ విశ్లేషిస్తుంటారు.
స్వయంగా జగన్ కుటుంబానికి ఓ పెద్ద మీడియా హౌస్ ఉంది. పేపర్, ఛానెల్, వెబ్ సైట్, పాడ్ కాస్ట్ ఉన్న మీడియా హౌస్ జగన్ సతీమణి భారతి కనుసన్నల్లో నడుస్తున్నా వీరికి మీడియా అంటే లెక్కలేనితనం మొదటినుంచి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చితే మీడియా విషయంలో జగన్ వైఖరి పూర్తిగా విరుద్ధంగా ఉండటం ఆదినుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా జర్నలిస్టులను ఫేస్ చేయటాన్ని ఆయన ఏమాత్రం ఇష్టపడరనేది అక్షర సత్యం.
ఇక వైసీపీని, వైసీపీ రాజకీయాలను పూర్తిగా డ్రైవ్ చేసింది ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జర్నలిస్టు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కాగా వీరు రాజకీయ నిపుణులు ఏమాత్రం కారు. పైగా వీరు వైసీపీ నేతలతో, కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు తమ సొంత కోటరీ మీద ఆధరపడతారు తప్పితే పబ్లిక్ పల్స్ వీరికి తెలియదని వైసీపీ నేతలంతా తొలినుంచీ చెబుతున్నా జగన్ ధోరణిలో మార్పు రాకపోవటం మరో విడ్డూరం.
5 ఏళ్లు అధికారంలో ఉండి మూడు ముక్కలాట ఆడిన జగన్ వ్యవహార శైలి ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే మంత్రులను ఇంటికి సాగనంపారు ప్రజలు. పైగా ఆ మూడు రాజధానులనైనా నిర్మించే చిత్తశుద్ధి చూపి, కొంతలో కొంత అయినా విజయం సాధించారా అంటే అస్సలు లేదు. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో ఈ దిశగా ఏమాత్రం పనులు ప్రారంభం కాలేదు. 10 ఏళ్ల రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేకుండా పోయిందనే ఆవేదన ప్రజల్లో బలంగా ఉందని స్పష్టంచేసేలా ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఉంది.
పొద్దున్న లేచినప్పటినుంచీ మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే, మీ బిడ్డకు మీ ఆశీర్వాదం అని ప్రచారాల్లో హోరెత్తించిన జగన్ ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడలేదనేలా పాలన ఉందనేది రాజకీయ పండితుల విశ్లేషణ. సంక్షేమం పేరుతో జనాల జేబుల్లోకి డబ్బులు పెట్టిన జగన్ పాలనపై చూపిన శ్రద్ధ శూన్యమని స్పష్టమవుతోంది.
ఇక అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కొందరు వైసీపీ నేతల గురించి ప్రత్యేకంగా ఈ ఓటమిపై విశ్లేషణలో భాగంగా చెప్పాలని వైసీపీ నేతలంటున్నారు. ఇక విజయసాయి రెడ్డి ట్వీట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనేది వైసీపీ నేతలు చెప్పే మాట. అత్యంత దిగజారుడు, నీచమైన పదజాలంతో, ఆరోపణలు చేస్తూ వెటకారాలతో కూడిన సాయిరెడ్డి ట్వీట్లు జగన్ విశ్వసనీయతపై బురదజల్లాయనేది పేర్లు చెప్పేందుకు ఇష్టపడని వైసీపీ నేతల అభిప్రాయం. ఇలా సోషల్ మీడియా, మీడియా, అసెంబ్లీలో సైతం వీరంతా నోరుపారేసుకుని పదేపదే ప్రతిపక్షాలపై, కొన్ని మీడియా హౌసులపై మాటల దాడి చేయటాన్ని రొటీన్ గా పెట్టుకున్నారు. ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలను విడిచిపెట్టకుండా పదేపదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి నేతల పర్సనల్ లైఫ్ పై విమర్శలు గుప్పిస్తూ, కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం మరింత నెగటివ్ గా మారింది. ఇది ఆయా సామాజిక వర్గాల ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందనేది వైసీపీ కార్యకర్తల మనోగతం. ఒకవైపు వంశీ, కొడాలి వంటి వారి స్టేట్మెంట్లతో వైసీపీ పరువు కొట్టుకుపోతుంటే ఇదంతా చూసి జగన్ అసెంబ్లీలో బహిరంగ సభల్లో నవ్వటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలే చాలాసార్లు మండిపడ్డారు.