ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికల విధానం చాలా కాలం పాటు బ్యాలట్ పద్ధతిలోనే సాగింది. గట్టిగా మాట్లాడితే ఇప్పటికీ పంచాయతీ లాంటి స్థానికసంస్థల ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. శాసన మండలికి సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కూడా బ్యాలట్ పేపర్లే వాడుతున్నారు. కానీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) ఉపయోగిస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిలో ఓడినవారు, ఓట్లు తక్కువగా వచ్చినవారు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ .. ఈ మూడింటి కూటమి అత్యంత భారీ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నడూ లేనంత ఆధిక్యత ఈసారి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 151 స్థానాలు వచ్చి, ఈసారి 11కు మాత్రమే పరిమితం కావడంతో ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి బ్యాలట్లే నయమంటూ ట్వీట్ చేయడంతో మరోసారి ఈవీఎం-బ్యాలట్ విధానంపై చర్చ మొదలైంది.
బ్యాలట్ పేపర్ల పద్ధతినే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఉపయోగించేవారు. 1982లో తొలిసారిగా కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను ఉపయోగించారు. అంతకుముందు వరకు అన్నీ బ్యాలట్ పేపర్లే ఉండేవి. ఆ తర్వాత కూడా పూర్తిస్థాయిలో ఈవీఎంలను ఉపయోగించలేదు. 1989లో భారత పార్లమెంటు 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి, ఎలక్ట్రానిక్ ఓటింగును అనుమతించింది. అయినా, అప్పటికీ అన్ని రాజకీయ పార్టీలూ ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో, ఈవీఎంలను ఇంకా అప్పటికి ఉపయోగించలేదు. 1998లో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించారు. 2001లో తొలిసారిగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలనే ఉపయోగించారు. అప్పటినుంచి అన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల్లో బ్యాలట్‌ను పూర్తిగా పక్కన పెట్టి ఈవీఎంలకే పెద్దపీట వేశారు.
మొదట్లో బ్యాలట్ పేపర్లు ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో బూత్ కాప్చరింగ్, దొంగ ఓట్లు వేయడం లాంటివి చాలా పెద్ద స్థాయిలో జరిగేవి. బ్యాలట్ బాక్సుల్లో ఇంకు పోసేవారు. పోలింగ్ ప్రారంభమైన కొంత సమయం తర్వాత బూత్ మొత్తాన్ని ఆక్రమించుకుని చకచకా 5-10 నిమిషాల్లో మొత్తం బ్యాలట్ పేపర్లు అన్నింటి మీదా తమకు కావల్సినవారికే ఓట్లు గుద్దేసుకుని, వాటిని బ్యాలట్ బాక్సుల్లో వేసేసి వెళ్లపోయేవారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ తరహా సంస్కృతి ఎక్కువగా కనిపించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఓటింగ్ జరిగేదని వినేవాళ్లం. అలాగే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేయాలంటే చాలా ఎక్కువ సమయం పట్టేది. ముందుగా బ్యాలట్ పేపర్లన్నింటినీ ఒక డ్రమ్ములో వేయడం, వాటిని బాగా కలిపి, తర్వాత పార్టీల వారీగా వేరు చేయడం, అప్పుడు ప్రతి ఒక్క ఓటునూ పోలింగ్ ఏజెంట్లు అందరూ చూడటం, వాటిని ఆయా డబ్బాల్లో వేసి, తర్వాత లెక్కపెట్టడం.. ఇంత ప్రక్రియ ఉండేది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం లాంటివి చాలా పెద్దవి కావడం, అక్కడ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండటంతో లెక్కింపు ప్రారంభించిన రోజు కాకుండా, ఆ తర్వాతిరోజు మధ్యాహ్నానికి గానీ లెక్కింపు పూర్తయ్యేది కాదు.
ఈవీఎంలు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బూత్ కాప్చరింగ్ లాంటివి పూర్తిగా తగ్గిపోయాయి. కానీ పోలింగ్ ఏజెంట్లు కుమ్మక్కు అయినచోట్ల దొంగ ఓట్లు మాత్రం ఇప్పటికీ పడుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బూత్ వద్ద ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తించిన ఒక సీనియర్ ఉపాధ్యాయుడి మాటల్లో చెప్పాలంటే, “ఆ రోజు ఒక వ్యక్తి ఒకే రంగు ప్యాంటు, షర్టు వేసుకుని, మెడలో కండువా వేసుకుని నాలుగు సార్లు వచ్చాడు. నాలుగుసార్లూ ఓటేశాడు. మేం నేరుగా అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. పోలింగ్ ఏజెంట్లలో ఎవరో ఒకరు అభ్యంతరం చెప్పాలి. కానీ అక్కడ టీడీపీ, వైసీపీ ఏజెంట్లలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. చివరకు ఆ వ్యక్తి సాయంత్రం 4 గంటల సమయంలో ఐదోసారి కూడా ఓటేయడానికి వచ్చాడు. ఏమయ్యా, నీకైనా విసుగు పుట్టడం లేదా, ఎన్నిసార్లు ఓటేస్తావని అడిగాను. దానికి అతను మాస్టారూ, మీకెందుకు సమస్య? ఏమైనా ఉంటే వాళ్లు అడగాలి గానీ మీరు అడగకూడదు కదా.. వాళ్లే ఎవరూ మాట్లాడటం లేదు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. అంతేతప్ప ఇలాంటివాటిలో వేళ్లు దూర్చకూడదు అని గీతోపదేశం చేశాడు” అంటూ ఆయన వాపోయారు.
ఈవీఎంలు శుద్ధపూసలు ఏమీ కావని ఈ ఒక్క సంఘటనతోనే తేలిపోయింది. సాంకేతికత ప్రకారం చూసుకుంటే ఎలాన్ మాస్క్ లాంటి వాళ్లు చెబుతున్నట్లుగానో, మరెవరో ఆరోపిస్తున్నట్లు గానో మన ఈవీఎంలను హ్యాక్ చేయడం గానీ, వాటిలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడటం లాంటివి గానీ ఉండవు. మన దేశంలో తయారుచేసిన ఈవీఎంలు ఇంటర్నెట్‌కు గానీ, మరేరకమైన పరికరాలతో గానీ అనుసంధానం చేయడం కుదరదు. ఒకవేళ వాటిలో ఏదైనా చిప్ లాంటివి పెట్టాలని ప్రయత్నిస్తే, సదరు ఈవీఎంలో అసలు ఓట్లు పడకుండా ఆగిపోతాయి. ఆ విషయం మొదటి ఓటు వేసేటప్పుడే తెలిసిపోతుంది. అందువల్ల సాంకేతికంగా ఈవీఎంలను తప్పుపట్టడానికి కుదరదు గానీ, దొంగ ఓట్లు వేయడం వీటిలో కూడా సాధ్యమేనని మాత్రం అర్థమవుతోంది. ప్రధానంగా ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున కూర్చునే ఏజెంట్లు అందరూ కలిసిపోయి ఒక పార్టీ వైపే పనిచేయాలని నిర్ణయించుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఇలాగే పెద్ద సంఖ్యలో టీడీపీకి ఓట్లు పోలవుతున్న విషయం తెలియబట్టే, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లి ఆగ్రహంతో ఈవీఎంలను పగలగొట్టి దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించారు, కేసు ఎదుర్కొంటున్నారు.
ఏ ఎన్నికల్లో అయినా.. వేవ్ అనేది ఒక్కోసారి ఒక్కోలా పనిచేస్తుంది. 2019లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వైపు వేవ్ కనిపించింది. అందుకే ఆ పార్టీకి 151 స్థానాలు వచ్చాయి. అప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలను ఏమీ అనలేదు. ఎక్కువమంది సంతృప్తి చెందారని, అందుకే తమకు ఓట్లేశారని అప్పట్లో చెప్పారు. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ మిషన్‌లో స్లిప్ వస్తుంది. అందులో ఎవరికి ఓటు పడిందో ఆ గుర్తు, అభ్యర్థి పేరు కూడా కనిపిస్తాయి. వాటిలో తేడా ఉంటే అప్పుడే అడిగేవారని, ఎవరూ అలా అడగలేదంటే వాటితో ఇబ్బంది లేనట్లే కదా అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం దారుణమైన ఓటమి ఎదురవడంతో ఈవీఎంలకు బదులు బ్యాలట్ పేపర్లు అయితే నయమని అంటున్నారు. నిజానికి జగన్ ఇప్పుడు చేయాల్సిన పని.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున పనిచేయాల్సిన ఏజెంట్లు కూడా మాట్లాడకుండా ఊరుకోవడం వల్లే కూటమికి ఏకపక్షంగా 164 స్థానాలు వచ్చాయి. అంతే తప్ప, ఇందులో ఈవీఎంల తప్పు ఏమీ లేదు. ఇప్పుడు మళ్లీ బ్యాలట్ పేపర్ల విధానం మొదలు పెట్టడం అంటే.. మళ్లీ మనం 80లు, 90ల కాలంలోకి వెనక్కి వెళ్లడమే అవుతుంది. కాలం గడిచేకొద్దీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకుని మెరుగుపడాలే గానీ, ఇంకా వెనక్కి వెళ్తామనడం మాత్రం సమంజసం కాదు.