US Senator warns India, China: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్‌లకు అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చౌక చమురును కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని చెప్పారు. రష్యా ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 80 శాతం ఈ మూడు దేశాలే కొనుగోలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కొనసాగించడానికి ఆర్థికంగా సహాయపడుతుందని వాదించారు.
“పుతిన్‌కు సహాయం చేస్తున్నందుకు ఆ దేశాలన్నింటిపై ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తారు” అని లిండ్సే గ్రాహం హెచ్చరించారు. చౌకగా లభిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని “బ్లడ్ మనీ”గా ఆయన అభివర్ణించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం లేదా పుతిన్‌కు సహాయం చేయడం మధ్య ఈ దేశాలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని లిండ్సే గ్రాహం తేల్చి చెప్పారు.
జాతీయ ప్రయోజనాలమేరకే..
రష్యా నుంచి చమురు కొనుగోలు వ్యవహారంలో గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం సుంకాల బెదిరింపులకు పాల్పడ్డారు. పలు దేశాలపై ఇష్టారీతిన అధిక టారిఫ్‌లు విధించారు. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులు జాతీయ భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తుందేనని భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.


