ఒకప్పుడు ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరుగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2 సార్లు తెలుగుదేశం పార్టీ, 2 సార్లు బిఆర్ఎస్ పార్టీ లు విజయం సాధించాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో వై.అంజయ్య యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముచ్చటగా మూడోసారి జరుగనున్న ఎన్నికల బరిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కదన రంగంలో నిలిచేందుకు సై అంటున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అప్పటి టిఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన వై.అంజయ్య యాదవ్ పై గెలుపొందారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బిఆర్ఎస్ హవా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక షాద్ నగర్ నియోజక వర్గంలో 2014, 2018 సంవత్సరాలలో జరిగిన రెండు ఎన్నికలలో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బిఆర్ఎస్ తరుపున బరిలో నిలిచిన అంజయ్య యాదవ్ విజయం సాధించి తన సత్తాచాటాడు. అనంతరం అప్పటి వరకు కాంగ్రెస్ కు అనుకూలంగా వున్న షాద్ నగర్ నియోజకవర్గంలో అంజయ్య యాదవ్ బిఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా మార్చారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సైతం బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వరకు 3సార్లు ఎన్నికలలో ప్రత్యర్థులుగా వున్న అంజయ్య యాదవ్, ప్రతాప్ రెడ్డి ఇద్దరు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ నుంచి ఇద్దరు పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు.
మాదంటే మాదే అంటున్న ఇరు వర్గీయులు
2023లో జరగనున్న ఎన్నికలలో షాద్ నగర్లో బిఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే అంజయ్య, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఇద్దరు టికెట్ ఆశిస్తుండటంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఎవరికి వారే టికెట్ తమకే కన్ఫార్మ్ అయిందని ప్రచారం చేసుకుంటుండటంతో సామాన్య కార్యకర్తలు గందరగోళంకు గురైతున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధియే తనకు మరోసారి టికెట్ వచ్చేలా చేస్తుందనే ధీమాలో అంజయ్య ఉండగా, కేటీఆర్ ఆశీస్సులతో టికెట్ తనకే అనే ధీమాలో ప్రతాప్ రెడ్డి వున్నారు. చివరికి షాద్ నగర్ బరిలో నిలిచేదెవరో గెలిచేదెవరో కాలమే పరిష్కారం చూపాలి. కార్యకర్తలు మాత్రం అధిష్టానం ఎవరికి పార్టీ టికెట్ ఇస్తే వారికే తాము మద్దతుగా ఉంటామంటున్నారు.