KAMAL HAASAN RAJYA SABHA : తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతం ఇస్తూ, ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ తొలిసారిగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, అధికార డీఎంకే కూటమిలో భాగంగా ఆయన రాజ్యసభకు ఎంపిక కావడంలో దాగి ఉన్న రాజకీయ వ్యూహాలు ఏమిటి? ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్ గెలుపు, ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో, ఈ ఏకగ్రీవ ఎన్నిక తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది?
తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం : మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తొలిసారి ఎంపీగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు నుంచి ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార డీఎంకే నుంచి ముగ్గురు, ప్రతిపక్ష ఏఐడీఎంకే నుంచి ఇద్దరు, అలాగే డీఎంకే మిత్రపక్షమైన ఎంఎన్‌ఎం తరపున కమల్ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఇది రాజకీయ వ్యూహాలకు, కూటములకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ : నామినేషన్ల పరిశీలనలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రాజ్యసభ ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రతి అభ్యర్థికి కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఈ నిబంధనను స్వతంత్ర అభ్యర్థులు పాటించలేకపోవడంతో వారి నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. జూన్ 12 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు గడువు ఉన్నప్పటికీ, ఆరుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండడంతో, వారి ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమైంది. ఈ నెల 12న వారికి ఎన్నికైనట్లు సర్టిఫికెట్లు అందజేయనున్నారు.
డీఎంకే కూటమిలో భాగంగా రాజ్యసభ కు కమల్ హాసన్ : ఈ ఎన్నికల ప్రక్రియ తమిళనాడులోని ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకేల బలాబలాలను మరోసారి చాటింది. డీఎంకే కూటమిలో భాగంగా కమల్ హాసన్ రాజ్యసభకు ఎన్నిక కావడం, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు డీఎంకేతో కుదిరిన పొత్తులో భాగంగానే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ల సమక్షంలో కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేయడం డీఎంకే-ఎంఎన్‌ఎం బంధానికి నిదర్శనంగా తమిళనాడు ప్రజానికం భావిస్తుంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ పాత్రను మరింత సుస్థిరం చేయనుంది.