Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Alampur politics: అలంపూర్ లో అంతుచిక్కని ఓటరునాడి

Alampur politics: అలంపూర్ లో అంతుచిక్కని ఓటరునాడి

ప్రచారానికి కార్యకర్తల ముసుగులో కూలీలు

80వ అసెంబ్లీ స్థానమైన ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన అలంపూర్ నియోజకవర్గంలో ఓటర్లనాడి తలపండిన రాజకీయ నాయకులకు సైతం అంతుచిక్కడం లేదు. 2లక్షల36వేల076 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో పురుషులు 1,16,989 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,19,080 మంది ఉన్నారు. అలాగే ట్రాన్స్జెండర్లు 7 మంది ఉండగా, ఇలా మొత్తం 2,36,076 మంది ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో 7
మండలాలు ఉండగా మొత్తం 2 లక్షల 36 వేల 076 మంది ఓటర్లున్నారు. నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నప్పటికీ అయిజా మండలంలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. కాగా ఈ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి ఎంతగానో బలపడి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డా.వి.ఎం. అబ్రహం నేతృత్వంలో ఎంతో బలపడింది. కాగా డిసెంబర్ మాసంలో నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు తీసుకున్న తరువాత ఎమ్మెల్యే అబ్రహంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆదిపత్యపోరును ప్రారంభించారు. ఎమ్మెల్సీ పదవి రాగానే నామినెటెడ్ పోస్టులలో భాగమైన జోగుళాంబ దేవస్థానం కమిటీని ఎమ్మెల్యే అబ్రహంకు తెలియకుండా తన వర్గానికి ఇప్పించుకున్నారు. ఇలా అనేక విషయాల్లో దళిత ఎమ్మెల్యే అబ్రహంను ప్రజలలో దూరం చేస్తూ చాపకింద నీరులా తన ఇంట్లో పని చేసే వ్యక్తి విజయుడికి బీ ఫాం ఇప్పించుకున్నారు. అప్పటిదాక ఎమ్మెల్యే అబ్రహం పేరును ప్రస్తావించిన సీఎం కేసీఆర్ సైతం ఎమ్మెల్యే అబ్రహంకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.

- Advertisement -

ఇదిలా ఉండగా MLC చల్లా వెంకట్రామిరెడ్డి 7 మండలాలోని రెడ్డి సామాజిక వర్గాన్నంత పోగు చేసి ఎమ్మెల్యే అబ్రహం తెరచాటుగా ఉంటూ నిరసనల కార్యక్రమాన్ని చేయించారు. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధిపత్యం సాగిస్తూ తన పెత్తనం చూపిస్తున్నాడని బలవంతులతో తాను ఎదుర్కొలేనని అందుకే రాజకీయలాలకు ఇక తాను దూరం జరిగి సైలెంట్ గా ఉంటానంటూ విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తంచేశారు.

👉 బలహీనపడ్డ బీఆర్ఎస్

ఎమ్మెల్యే అబ్రహం అనుచర వర్గమంతా ఎమ్మెల్యేకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పార్టీ మండలాధ్యక్షులు వివిధ సంఘాల నాయకులంతా కాంగ్రెస్ లో చేరిపోయారు. చల్లా వెంకట్రామిరెడ్డి తీరుతో మాజీ ఎంపీ, ప్రస్తుత డిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న డా. మందజగన్నాథం, మంద శ్రీనాథ్, అలంపూర్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్మాయిల్ ఆర్టీస్ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి, మేడికొండలక్ష్మికాంతరావు, అయిజ తిరుమల రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి ఇలా ఎంతో మంది కాంగ్రేస్ లో చేరిపోయారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను తిరస్కరించడమే కాకుండా విద్యావంతులకు, పార్టీ సీనియర్ నాయకులను -పక్కన పెట్టి తన ఇంట్లో పని చేసే వాడికి విద్యజ్ఞానం లేకపోవడం, కనీసం పార్టీలో సభ్యత్యం కూడా లేని వాడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం ఇప్పించడం ఏమిటంటూ అలంపూర్ నియోజక వర్గంలోని ప్రజలంతా చల్లా వెంకట్రామిరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్పటిదాక బలంగా ఉన్న బీఆర్ఎస్ కాస్తా ఒక్క సారిగా నియోజకవర్గంలో బలహీనపడింది.

👉 ప్రచారం కోసం కూలీలకు కార్యకర్తల ముసుగులు

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలని పంతానికి వెళ్లిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తన దగ్గరున్న ఐశ్వర్యాన్ని అస్త్రంగా వాడాడు. ఇంటింటికి ప్రచారానికి వెళితే రూ.200, సభలకు వస్తే రూ.300, అలాగే 50 మందిని పట్టుకుని వచ్చిన వారికి రూ.2వేలు, ఇక అన్నీ నెత్తిన వేసుకుని పని చేసే వారికి రోజుకు రూ.5 వేలు, పార్టీలో చేరే లోకల్ లీడర్లకు 5లక్షల, నుండి 10 లక్షల దాక ఆఫర్లు ప్రకటించడంతో చోటా మోటా నాయకులంతా జేబీలో ఉన్న కాస్తో కూస్తో డబ్బును ఖర్చు పెట్టి జనాన్ని తీసుకెళ్లి కర్నూలులో ఉన్న చల్లా వెంకట్రామిరెడ్డికి దండలు వేసి దండాలు పెట్టి తాను ఒక నాయయకుడిగా చలామణి అయ్యే పనిలో పడ్డారు.

19వ తేది సీఎం కేసీఆర్ సభకు వచ్చిన జనాలకు చల్లా అనుచర వర్గం ఒక్కోక్కరికి రూ.500 ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. ప్రచార పర్వంలో డబ్బులు సంపాదిస్తున్న జనం గంట సేపు ప్రచారంలో పాల్గొంటే గంటకు వంద రూపాయల చొప్పున వివిధ పార్టీలు నజరాన ప్రకటిస్తుండటంతో ఆయా పార్టీ నాయకులంతా కండువాలు కప్పుకుని ఊర్లో తిరుగుతున్నారే తప్ప ఏ ఒక్క ఓటర్లును కలసి ఓటు వేయండి అంటూ అడగటం లేదు. దీంతో ఎన్నికల వాతావరణం ఒక్క సారిగా పలుచబడిపోయిందీ. నాయకుల వెంట ఓట్లు వేసే జనం మాత్రం ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటున్నారు. ఎవరు వచ్చినా “మా ఓట్లు లోలోపలా మీకే..! ” అంటూ కామన్ డైలాగ్ చెప్పేస్తున్నారు.

👉 ప్రచారం ముసుగులో రెడ్డిల ఆధిపత్యాన్ని ఉతికారేస్తున్న అభ్యర్థులు

సందిట్లో సడేమియ్యా అన్నట్టు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఒక వైపు బీఎస్పీ అభ్యర్థి ప్రొఫెసర్ డా ఆర్ ఎస్ ప్రసన్నకుమార్, మరోవైపు
కాంగ్రెస్ అభ్యర్థి డా. ఎస్.ఏ సంపత్ కుమార్ లు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో చల్లా రెడ్డి పెత్తనం ఏమిటంటూ చల్లా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తమ ప్రసంగాల ద్వారా ఉతికి ఆరేస్తున్నారు.

ఏదేమైనప్పటికీ అలంపూర్ లో ప్రధానంగా బీజేపీ, బీఎస్ పీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ఈతో పాటు మరి కొంత మంది ఇండిపెండెట్ అభ్యర్థులు భరిలో ఉన్నప్పటికి ఇక్కడ మాత్రం ద్విముఖ పోటీ కనిపిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య హోరాహోరి నడుస్తుంది.

👉 ఆకట్టుకుంటున్న బీఎస్ పీ ప్రచారం

బీఎస్పీ అభ్యర్థిగా డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు డా. ఆర్ ఎస్ ప్రసన్న కుమార్ నామినేషన్ వేసిన తరువాత బీఎస్ పీ ప్రచారం ఊపందుకుంది. బీఎసీపీ ఎంట్రీతో అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఓట్టు చీలే అవకాశం ఉందని అధికార పార్టీ వారు అయోమయంలో పడ్డారు. బీఎస్పీకి అండగా స్వేరో సైన్యంతో పాటుగా దళిత, బీసీ సామాజిక వర్గాలు, గురుకుల పాఠశాలలో చదువుకున్న యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు అండ ఉండటంతో అటు టీఆర్ఎస్, ఇటూ కాంగ్రెస్ పార్టీలకు బీఎస్ పీ ప్రసన్నకుమార్ వణుకుపుట్టిస్తున్నారు. రోజు రోజుకు మారుతున్న ఎన్నికల వాతావరణంతో 30 వ తేది ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారోనని అన్నీ ప్రధాన పార్టీల నాయకులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఏదేమైన అధికార పార్టీ మాత్రం బాగా బలహీన పడటంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత అలంపూర్ పై ప్రత్యేక దృష్టిని సారించి ఎప్పటి వివరాలు అప్పటికి అడిగి తెలుసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News