మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గత రెండు రోజులుగా నంద్యాలలో ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అఖిలప్రియను అదుపులోకి తీసుకొని ఆళ్లగడ్డ కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఆమెతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని, భార్గవరామ్ కూడా అదుపులోకి తీసుకొని ఆళ్లగడ్డకు తరలించారు.
అనంతరం వారిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో టౌన్ సీఐ రమేష్ బాబు, రూరల్ సీఐ హనుమంతనాయక్ ఎస్ఐలు వెంకటరెడ్డి నరసింహులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు, అవరోధాలు కలిగినా తన దీక్షను ఆపేది లేదని పేర్కొన్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి త్వరగా బయటికి రావాలని అంతవరకు కూడా తమకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ దీక్షలు ఆపేది లేదని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు.