కోరుట్ల నియోజకవర్గంలో వింత రాజకీయం నడుస్తోంది.. సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా నడిచింది. అరవింద్ పై సంజయ్ విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ది BRS పార్టీ. సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇటు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ చేతికి వచ్చింది. ఇక అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. నూతన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎంపిగా ఉన్న ధర్మపురి అరవింద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది.
వెరసి నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య రాజకీయం మూడు ముక్కలాటగా రంజుగా మారింది. రాష్ట్రంలో ఒకరు, కేంద్రంలో ఇంకొకరు, నియోజకవర్గంలో మరొకరు.. ఇలా మూడు పార్టీల మధ్య నియోజక వర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు పొలిటికల్ హీట్ మధ్య డే అండ్ నైట్ నలిగిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందేమోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు తమ పార్టీకి నియోజకవర్గంలో ప్రాతినిద్యం ఉండటంతో ఎవరి రాజకీయాలు వారు బిజీగా ప్రస్తుతానికి చేసేసుకుంటున్నారు. రానున్న స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాజకీయ సెగ మరింత రాజుకునేందుకు రంగం సిద్ధమైంది. మొత్తానికి మల్లాపూర్ మార్క్ రాజకీయాలు గమ్మతుగా ఉన్నాయన్నమాట.