Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Anantapuram: ఉపాధి కూలీ ఎమ్మెల్యే కాబోతున్నాడా?

Anantapuram: ఉపాధి కూలీ ఎమ్మెల్యే కాబోతున్నాడా?

మడకశిరలో వైసిపి, టిడిపి కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ

దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులకు ఎన్నికలు జరగడంతో పాటు ఐదు రాష్ట్రాల్లో పార్లమెంటు సభ్యులకు ఎన్నికలు, శాసనసభ సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. తుది విడత జూన్ 1 తేదీన నిర్వహిస్తున్నారు. ఒకటవ తేదీ సాయంకాలం 6 గంటలకు ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం 82 శాతం కు చేరింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మడకశిర నియోజవర్గంలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

- Advertisement -

ఎవరు మడకశిరలో విజయం సాధిస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో వైసిపి టిడిపి పార్టీలకు పోటీ తీవ్రంగా ఉంటే మడకశిర నియోజకవర్గంలో అందుకు భిన్నంగా త్రిముఖ పోటీ ఏర్పడింది. వైయస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర లక్కప్ప పోటీలో నిలవగా, టిడిపి కూటమి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజు, కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బరిలో నిలిచారు.

ముందుగా వైసిపి పార్టీ అభ్యర్థి ఈర లక్కప్ప విషయానికొస్తే ఈర లక్కప్ప ఉపాధి కూలీ పనికి వెళ్తూ తన జీవనాన్ని సాగించేవారు. ఆయనకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సింగనమలలో టిప్పర్ డైవర్ వీరాంజనేయులు కు, మడకశిర లో వైసిపి ఎమ్మెల్యే టికెట్ ఉపాధి కూలీ ఈర లక్కప్పకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈర లక్కప్పకు మాజీ మంత్రి నర్సే గౌడ్, వైయస్సార్సీపి నేత శివకుమార్ ల సపోర్ట్ ఉంది. వారిని కలుపుకొని ఈర లక్కప్ప 60 రోజులు రోజులు పాటు విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి తెలియజేశారు. టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు విషయానికొస్తే ఎమ్మెస్ రాజు సొంత మండలం సింగనమల, సింగనమల నియోజవర్గం టిడిపి ఎమ్మెల్యే టికెట్ బండారు శ్రావణిశ్రీ కి దక్కడంతో ఎమ్మెస్ రాజుకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దీంతో ఎస్సీ నియోజకవర్గంలో ఏదో ఒక చోట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని టిడిపి అధిష్టానం నిర్ణయించుకుంది. దీంతో మడకశిర టిడిపి కూటమి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు టిడిపి అవకాశం కల్పించారు.

అయితే మడకశిర నియోజకవర్గ నుంచిమొదట టిడిపి ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ వేసే సమయంలో రెండు రోజులు ముందు ఎమ్మెస్ రాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆయన కుమారుడు సునీల్ కుమార్ చివరి నిమిషంలో టికెట్టు మార్చడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసి మడకశిరలో టిడిపి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అయితే ఎన్నికలు ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెస్ రాజుకు, మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు టిడిపి అధిష్టానం సర్ది చెప్పింది. దీంతో ఎమ్మెస్ రాజు వెంట వారు ప్రచారానికి తిరిగినట్లు సమాచారం అందుతోంది. ఇంకా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ విషయానికి వస్తే సుధాకర్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ముఖ్య అనుచరుడు.

అనంతపురం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టి పోటీ ఇచ్చిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మడకశిర నియోజవర్గం అని చెప్పవచ్చు. మాజీమంత్రి రఘువీరారెడ్డి మడకశిర నుంచి 1989, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతపూర్ జిల్లాలో ఇప్పటివరకు 12 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఘనత రఘువీరా రెడ్డి కే దక్కుతుంది. మరలా 2009లో నియోజకవర్గాలు పునర్విభజన జరగడంతో మడకశిర నియోజవర్గం ఎస్సీ రిజర్వు రావడంతో రఘువీరారెడ్డి 2009లో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 రాష్ట్ర విభజన జరగడంతో రఘువీరా రెడ్డి పెనుగొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 16 వేల ఓట్లు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 30 వేల పైచిలుకు ఓట్లను సాధించారు.

నీలకంఠాపురం రఘువీరా రెడ్డికి మడకశిర నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపురం, మడకశిర నియోజవర్గం. దీంతో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కర్త, కర్మ, క్రియ అంతా రఘువీరా రెడ్డి అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ కు ఈ ఎన్నికల్లో రఘువీరారెడ్డి వెన్ను దన్నుగా నిలిచారు. మడకశిర నియోజవర్గానికి ఐదు మండలాలు ఈ నియోజవర్గంలో ఉన్నాయి, మడకశిర, ఆగలి అమరాపురం, రోళ్ల, గుడిబండ మండలాలు వస్తాయి. దాదాపు రెండు లక్షలకు పైగా ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు. అందులో 40 వేల మంది ఎస్సి ఓటర్లు, వక్క లిగలు దాదాపు 60 వేల మంది ఓటర్లు, దాదాపు 40 వేల మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు తోపాటు కురుబ, బోయ సామాజిక వర్గాల ఓటర్ల జనాభా అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర లక్కప్ప విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు విద్యావంతులు బహిరంగంగా చెబుతున్నారు. జూన్ 4 ఫలితాల్లో ఎవరికి విజయం వరిస్తుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News