YSR Jayanthi: వైఎస్ఆర్.. ఈ పేరు మూడు అక్షరాలు కాదు. మూడు తరాల తర్వాత కూడా గుర్తుండిపోయిన పేరు. ఎన్నో సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపిన పేరు. వైఎస్‌ఆర్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన నాయకుడు. పాలించింది ఐదున్నర సంవత్సరాలు అయినా తరతరాలుగా నిలిచిపోయే పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారు. నేడు వైఎస్‌ఆర్ 76వ జయంతి సందర్భంగా ఆయన సేవలను ఓసారి స్మరించుకుంటూ తెలుగుప్రభ స్పెషల్ స్టోరీ.
వైఎస్ఆర్ అసలు పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949, జులై 8వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించారు. అందరూ ముద్దుగా వైఎస్‌ఆర్ అని పిలిచేవారు. ఆయన స్కూలింగ్ బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. అనంతరం విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పొందారు. ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్‌సర్జన్ డిగ్రీ సొంతం చేసుకుని డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితులైన వైఎస్‌ఆర్.. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తం ఆరు సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించడం విశేషం. అంతేకాకుండా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 1983 నుంచి 1985, 1998 నుంచి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. ఇక 1999 నుంచి 2004 వరకు శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించారు.
2003లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యారు. అలా మంచి జనాదరణ పొందారు. అనంతరం జరిగిన 2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2004-09 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. పేదల జీవితాల్లో భారీ మార్పులు తీసుకొచ్చాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, జలయజ్క్షం, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలు, పావలా వడ్డికే రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుతో రెండో సారి కూడా అధికారంలోకి వచ్చారు. 2009లో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దురదృష్టశాత్తూ అదే ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు రాజన్న అంటూ ముందుగా పిలుచుకునే వైఎస్‌ఆర్ ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. ఆయన మరణించి 16 సంవత్సరాలు అవుతున్నా పేదల గుండెల్లో శాశ్వతంగా బతికే ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్.


