ఉమ్మడి మెదక్ జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం ఆందోలు. ఈ నియోజకవర్గంలో జెండా ఎత్తిన పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుందని విశ్లేషకులకు మంచి అభిప్రాయం ఉంది. ఒకప్పుడు సాధారణ ఎమ్మెల్యే, ఆ తర్వాత ప్రాథమిక విద్యాశాఖ మాత్యులు, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిని అధిరోహించిన దామోదర్ రాజనర్సింహ తమ్ముడి రూపంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఎదురైంది.
ఆందోల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈయన చేతుల్లోనే
రాముని బాటలో లక్ష్మణుడిలా వెన్ను వెంట ఉండి ఆందోలు కాంగ్రెస్ కార్యకర్తలను సైతం తన చేతుల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకునే రామచంద్ర నరసింహ ఒక్కసారిగా కాంగ్రెస్ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలపై సాంఘిక మాధ్యమాలలో మాకేం పోటీ లేదు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో హస్తం
ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకుల మధ్య వైరం ముదరడం తో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్నారు. అంతటి పేరు ప్రఖ్యాతి ఉన్న నాయకుడి సోదరుడు బీజేపీలో చేరటమంటే హస్తం కార్యకర్తల్లో ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ఆధ్వర్యంలో రామచంద్ర బీజేపీలో చేరడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తానికి ఆందోల్ రాజకీయాలూ రోజూ ఒక మలుపు తిరుగుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఆందోల్ బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ కే ఇస్తారా లేక అభ్యర్థిని మారుస్తారా? ఒకవేళ అలా మారిస్తే మళ్లీ ఇక్కడ బీఆర్ఎస్ లో కూడా అలకలుంటాయనే అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.