వైయస్ జగన్ కోటరీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు, 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తలేనని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు వైయస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
కోటరీ అనేది అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో సాధారణంగా కనిపించేదే. టీడీపీలో చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? ఆ కోటరీల గురించి బయట ఉన్నవారెవరైనా మాట్లాడితే బాగుంటుంది. అంతేకానీ కోటరీలో ఉండి వచ్చిన వ్యక్తులే కోటరీ గురించి మాట్లాడటం భావ్యం అనిపించుకోదు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోయిన తర్వాత ఇంతకన్నా పద్దతిగా మాట్లాడతారని మేం అనుకోలేదు. ఢిల్లీ వేదికగా రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు వరకు ఏ పార్టీలో చేరబోయేది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆయన మాటల్లో మార్పు చాలా స్పష్టంగా, భిన్నంగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డికి ఒకరి మీద మనసు విరిగిపోయిందంటే ఇంకొకరి ప్రేమ పుట్టిందనే అనుకోవాలి.
గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ఇలా మాట్లాడేవారేనా?
వైసీపీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత 10 నెలల కాలంలో చాలా పరిణామాలు చూసింది. పలువురు పార్టీని వీడి వెళ్లిపోయారు. కొందరు పార్టీ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలిచి వైయస్ జగన్ రెండోసారి సీఎం అయ్యుంటే వీళ్లంతా ఇలా మాట్లాడే వారేనా? పార్టీని వీడి వెళ్లిపోయే వారేనా? ఇది ఏ ఒక్కరి గురించో కాదు. అందరికీ వర్తిస్తుంది. తాజాగా విజయసాయిరెడ్డి మాటలను బట్టి ఆయన వ్యవసాయం చేయబోవడం లేదు, రాజకీయమే చేస్తారని స్పష్టంగా అర్థమైపోయింది.
రాజకీయాల్లో నిత్యం అధికారంలో ఉండటం సాధ్యం కాదు. తప్పులను సరిదిద్దుకోవాలే కానీ, నిందలు మోపడం సరికాదు. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో తప్పు జరిగిందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తాయి. మనం పేర్లు చెప్పినంత మాత్రాన వారంతా నిందితులు అయిపోతారా? వ్యక్తిగత విమర్శలు చేసి వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్రలు ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. బురదజల్లేసి పోవడం కొందరు పనిగా పెట్టుకుంటారు.
యువత పోరుతో ప్రభుత్వం కళ్ళు తెరవాలి
ఎన్నికలకు ముందు విద్యార్ధులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరుతో ఈ ప్రభుత్వంపై విద్యార్ధి, యువజనుల్లో ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించి తీరాల్సిందే. విద్య, వైద్యరంగాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ప్రజలకు సేవలందించాలి. ఈ రెండు రంగాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడంపై వైసీపీ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంది.
అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. కూటమి నాయకులు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిదానికీ గత వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ బురదజల్లాలని చూస్తున్నారు. గతేడాది వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఒకే త్రైమాసికంకు సంబంధించిన బకాయిలు మాత్రమే ఉన్నాయి.
విద్యాదీవెన, వసతి దీవెనకి సంబంధించి ఏడాదికి రూ. 3,900 కోట్లు చెల్లించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది కేవలం రూ. 700 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇప్పటికీ రూ. 3200 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మరో రూ. 3900 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రెండేళ్లకు కలిపి రూ. 7100కోట్లు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 2600 మాత్రమే కేటాయించడం దారుణం.