Bengal: “నోట్లో యాసిడ్ పోసి.. బూడిద చేస్తా” అంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత బీజేపీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యేపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత అబ్దుర్ రహీం చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఒక బహిరంగ కార్యక్రమంలో మాల్దా జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అబ్దుర్ రహీం బక్షి (Abdur Rahim Bakshi) మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన 30 లక్షల మందిని బంగ్లాదేశీయులు, రోషింగ్యాలుగా అభివర్ణిస్తూ.. అసెంబ్లీలో శంకర్ ఘోష్ (Shankar Ghosh) వ్యాఖ్యానించారు. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలను అబ్దుల్ రహీం తప్పుబట్టారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నోట్లో యాసిడ్ పోసి.. బూడిద చేస్తానంటూ హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వాసులను వేధిస్తున్నారని, నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. బెంగాల్ ప్రజలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్న భాజపాను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ప్రజలను కోరారు.
Read Also: Archery: వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్.. భారత్ కు రెండు పతకాలు..!
అబ్దుల్ రహీంపై బీజేపీ ఫైర్
అబ్దుర్ రహీం వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఆ వ్యాఖ్యలను కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. అధికార టీఎంసీ బెంగాల్ లో హింస, బెదిరింపు సంస్కృతులను పెంచుతోందని ఆరోపించింది. త్వరలో ఎన్నికలు వస్తుండడంతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో టీఎంసీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేత ఖాగెన్ ముర్ము అన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిరోధించడంలో విఫలమైనందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శిరస్సు ఖండించి బల్లపై ఉంచాలంటూ టీఎంసీ ఎంపీ మహువా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. ఈ వ్యవహారంలో మహువాపై కేసు నమోదైంది. ఓ స్థానిక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ పోలీసులు తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా 1971 సమయంలో రాయ్‌పుర్‌లోని మానా క్యాంప్ ప్రాంతంలో అనేకమంది బంగ్లాదేశీ శరణార్థులు స్థిరపడ్డారని, మహువా వ్యాఖ్యలు వారిలో భయాందోళనలు రేకెత్తించాయని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ కోత్వాలీ పోలీసు స్టేషన్‌లోనూ ఆమెపై ఫిర్యాదు దాఖలైంది. అయితే, వివాదాల జోలికి పోవద్దని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినప్పటికీ.. వరుసగా టీఎంసీ నేతలు తమ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
Read Also: Bigg Boss: ఉహకందని మార్పులు.. ఊహించని ట్విస్టులు.. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్


