పంచాయతీ ఎన్నికలకు ఏ క్షణంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందోనని అధికార కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు ప్రణాళిలు రచిస్తుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం మౌనంగా ఉంది. దీంతో క్యాడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
మినీ అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి లేదా?
పంచాయతీ పోరు ఒకరకంగా పార్టీలన్నింటీ మినీ అసెంబ్లీ ఎన్నికల్లాంటివి అలాంటిది వీటిపై గులాబీ పెద్దలకు ఆసక్తి లేదా అంటూ శ్రేణులు ఒకటే ఆందోళనలో ఉన్నారు. గ్రామస్థాయిలో ఏపార్టీకి ఎంత పట్టు ఉందనేది ఈ ఎన్నికల ద్వారానే తెలుస్తుంది. ఆ ఫలితాలను బట్టే పార్టీలు పావులు కదుపుతాయి. అంతటి ప్రాధాన్యమున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణను రూపొందించపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలు అధికారికంగా పోటీ చేయకపోయినా నాయకత్వం బలపరిచే అభ్యర్థులే బరిలో ఉంటారు. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల ఎంపికలో ముందున్నది. మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తుండగా బీఆర్ఎస్ మాత్రం పోటీ చేయడానికే విముఖంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నది.
గెలిచినా పనులు కావనే
నిన్నామొన్నటి దాకా పై స్థాయి నుంచి కిందిస్థాయి నాయకత్వం అంతా పార్టీ మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్-ఈ ఫార్మూలా రేస్ కేసు చుట్టే తిరిగింది. కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే పరిస్థితేంటీ అన్న అంశాలపైనే చర్చలు కొనసాగాయి. పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలపై ఎక్కడా మాట్లాడలేదు. పార్టీ అధికారంలో లేనందున గెలిచినా పనులు కావనే అభిప్రాయంతో అధిష్టానం ఉందనే వాదన సైతం ఉంది. పోటీ చేయకపోవడమే ఉత్తమమనే అభిప్రాయం కూడా షికారు చేస్తుండటంతో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం పంచాయితీ ఎన్నికల మీద ఎలాంటి ముందడుగు వేయట్లేదు. దీంతో పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న ఆశావాహులు డీలా పడిపోతున్నారు.
లోక్సభ ఫలితాల అనుభవంతో
గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. 2002లో పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. ఆ చేదు ఫలితాల తర్వాత సీనియర్లు చాలామంది పార్టీ మారారు. అధికార పార్టీలో ఉంటే పనులు చక్కబెట్టుకోవచ్చని స్థానిక నేతలు సైతం గోడలు దూకేశారు. ఇలాంటి సంకట పరిస్థితుల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ నాయకత్వానికి పాలుపోవడం లేదు. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఘోరపరాభవం ఎదురైతే పరిస్థితేంటన్న ఆందోళన మొదలైంది. దీంతో పార్టీ హైకమాండ్ పోటీపై అనాసక్తిగా ఉందన్న భావన క్యాడర్లో ఉంది. అదే జరిగితే మాత్రం బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు తప్పవని కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు.