ప్రజా ఆశీర్వాద సభకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతం సర్వం సిద్ధమైంది. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌లు ఇక్కడి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన జాగ్రత్తలను తీసుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుండి జనసమీకరణ చెసేందుకు బస్సులు, తదితర వాహనాలు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ వేదికకు ఎడమవైపు హెలిప్యాడ్ నిర్మించారు.
మహిళలకు, వికలాంగులకు, విఐపి లకు ప్రత్యేకంగా గ్యాలరీలు నిర్మించారు. సుమారు లక్ష మందికి పైగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఈ సభకు హాజరవుతారని అంచనా వేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు అన్ని గ్రామాల నుండి మహిళలు, యువత, నాయకులు, అభిమానులు ప్రజలు తరలివస్తారని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సాగునీటి కోసం ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇంటింటికి మంచినీరు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తాయని, అలాగే మూడవసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయన్నారు.
అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి మూడవసారి పట్టం కట్టాలి. హుస్నాబాద్‌లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, ఏసీపీ కార్యాలయం, సమీకృత కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు, తండాలను గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేయడం, చెక్ డ్యాంలు, గౌరవెల్లి ప్రాజెక్ట్, శనిగరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ, మిషన్ భగీరథ, ఎస్టీ కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్‌లు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు హుస్నాబాలో జరిగాయి. మూడోవసారి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తా. నేటి సీఎం కెసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.