త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కాంగ్రెస్ ముఖ్య నేత, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలనానికి తెరలేపారు. అంతేకాదు, కొందరు బీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీలోకి వెళ్తారంటూ మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ లోని అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
కాగా, గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. హ్యాట్రిక్ కొడుతుందని ధీమాగా ఉన్న బీఆర్ఎస్ బోల్తా కొట్టింది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి సీఎంగా నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికల్లో 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ… పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. లోక్ సభ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకుంది.
ఫలితంగా ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అనే టాక్ జనాల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దీంతో కారు పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మరోసారి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ లో ఉన్న అగ్రనేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ లో ఫిరాయింపులు ఉంటాయని చెప్పారని టాక్ నడుస్తోంది.