Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Huzurabad: మోదీలేని భారత్ ను ఊహించుకోలేం

Huzurabad: మోదీలేని భారత్ ను ఊహించుకోలేం

హుజురాబాద్ ప్రజాహిత యాత్రలో బండి

కాంగ్రెస్ పార్టీ దోఖాబాజీ (మోసపూరిత) పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. లక్షలాది కుటుంబాలు గత పదేండ్లు ఇండ్లు కోసం అల్లాడుతుంటే నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు ఇస్తామనడం ఎంత వరకు సమంజసమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీరును చూస్తుంటే వెయ్యి మందిని పెండ్లికి పిలిచి అందులో 10 మందికి మాత్రమే అరిటాకులో అన్నం పెట్టినట్లుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి ఉందని, అప్పుల్లో ఉన్న తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేయాలంటే రూ.5 లక్షలు కోట్లు అవసరమని, ఆ నిధులు ఎక్కడి నుండి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ లేని భారత్ ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదన్నారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలంతా సిధ్ధమయ్యారన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా హుజురాబాద్ పట్టణంలో పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…
తనను రెండోసారి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీగారికి, అమిత్ షా, జేపి నడ్డా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

- Advertisement -

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం మర్చిపోలేనని అన్నారు. తన జీవితం ప్రజలకి అంకితమని ప్రజలు వేసిన ఓటువల్లే రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటాలు చేయించి అండగా నిలిచేలా చేసిందని, కష్టాల్లో ఉన్న పేదవాడికి భరోసా ఇచ్చిందని అన్నారు. కరీంనగర్ అభివ్రుద్దికి 12 వేల కోట్ల నిధులు తెచ్చింది. జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది. తొలి జాబితాలోనే సీటు ఇప్పించింది. ఇదంతా మీ చలువే. నా జీవితాంతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్దికి పాటుపడతా. మళ్లీ ఎంపీగా గెలిపిస్తే ప్రధానిని ఒప్పించి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో కరీంనగర్ ఆదర్శంగా నిలిచేలా క్రుషి చేస్తానని అన్నారు. దేశమంతా మోదీ గాలి వీస్తోంది. ప్రజాహిత యాత్రలో భాగంగా వేమలవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించాను. ప్రజలు ఆదరిస్తున్నారు. అనూహ్య స్పందన లభిస్తోంది. నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిని చేస్తామని ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాకు పోటీయే కాదు. గతంలో కంటే భారీ మెజారిటీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ. 6 గ్యారంటీల విషయంలో ప్రజలను మోసం చేస్తోంది అని అన్నారు. నియోజకవర్గానికి 3 వేల 5 వందలు ఇండ్లు కట్టించి 5వ హామీ నెరవేరుస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. వామ్మో వీళ్ల మాటలు వింటుంటే మతిపోతోందని హెద్దేవ చేశారు. ఎన్నికలకు ముందు ఎట్లాంటి కండిషన్లు లేకుండా అర్హులైన వారందరికీ 6 గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ కు ఓటేస్తే మహిళలకు ప్రతినెలా రూ.2500లు, ఆసరా కింద రూ.4 వేల పెన్షన్, రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తారని భావించారు. అవికూడా వంద రోజుల్లో ఇస్తారనుకున్నారు. కానీ వాటిలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్ల నిధులు అవసరం. అప్పుల్లో ఉన్న తెలంగాణ ఎక్కడి నుండి నిధులు తీసుకొస్తారో ప్రజలకు చెప్పాలన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన 10 లక్షల మంది పేద కుటుంబాలకు ఇంత వరకు కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదు. వాళ్లకు 6 గ్యారంటీలకు అసలే నోచుకోవడం లేదు. పోనీ రేషన్ కార్డులున్న వాళ్లకైనా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే.. అందులో 40 లక్షల మందికి మాత్రమే 5 వందలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లు ఉచిత కరెంట్ ను అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడేమో నియోజకవర్గానికి 3 వేల 500 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తరట. కొత్తవి కట్టిస్తారా? శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లు ఇస్తరా? రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలు ఇండ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నయ్. దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ ఇన్నాళ్లు కాళ్లు అరిగేలా తిరిగిర్రు… ఇప్పుడేమో 3వేల 500 మందికే ఇస్తామంటే మిగిలిన వాళ్ల సంగతేంది? వీళ్ల తీరు ఎట్లుందంటే…. పెండ్లికి వెయ్యి మందిని పిలిచి అరిటాకులు వేసి… 10 మందికే అన్నం పెట్టి… మిగిలిన వాళ్లు వెయిట్ చేయండి…తరువాత పెడతాం అన్నట్లుంది అని అన్నారు. ఎన్నికలప్పుడు ఈ కండిషన్లు ఎందుకు పెట్టలే… ఇవేనా 6 గ్యారంటీలంటే… ఈ హామీలను చూస్తుంటే… 6 గ్యారంటీలు కాదు… కాంగ్రెస్ 6 మోసాలని ప్రజలకు అర్ధమైంది… కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 420 హామీలు కాదు… తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది. ఒక్క మహాలక్ష్మీ పథకానికి రూ.50 వేల కోట్లకుపైగా కావాలి నిధులు ఎక్కడి నుండి తెస్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News