హరీష్, కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పరీక్షలు వాయిదా వేయాలని అమాయక విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టడం కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కేటీఆర్, హరీష్లు ఇద్దరూ ఆమరణ దీక్షకు కూర్చోవాలని సీఎం ఛాలెంజ్ చేశారు.
పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయాలని, మా ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే…బిల్లా రంగాలు ఆమరణ నిరాహార దీక్షకు దిగండి అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని, నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అంటూ రేవంత్ సమర్థించుకున్నారు. కేసీఆర్ కు బీఆరెస్ కు పుట్టగతులు ఉండవనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని భగ్గుమన్నారు. మేం మీలా దొంగ దెబ్బ తీయడంలేదు.. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదని, కేసీఆర్ … ముందుంది ముసళ్ల పండగ అంటూ హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? బీజేపీ, బీఆరెస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పాన్నారు.
కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదని, చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చో అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాలుగు రోజులుగా హరీష్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని, తనదాకా వస్తే గాని వాళ్లకు నొప్పి తెలియలేదన్నారు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాని చేస్తున్నారని ఆరోపించిన సీఎం, కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని ఆరోపించారు.
ఎప్పుడు పార్టీ బలహీనపడితే.. అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారని రేవంత్ అన్నారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని, పరీక్షలు వాయిదా వేసే వరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు హరీష్, కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలన్నారు, పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వాళ్ల పక్షాన మీరు దీక్షకు దిగండన్నారు. మా ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే…బిల్లా రంగాలు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలన్నారు.