PM Modi Mother AI Video: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ విడుదల చేసిన ఓ ఏఐ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సడెన్‌గా ఈ వీడియో చూస్తే ఇది నిజంగా నిజమేనేమో అని భ్రమ కల్పించడం మాత్రం ఖాయం. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటు చోరీ అయిందంటూ యాత్ర చేపట్టిన కాంగ్రెస్.. తాజాగా AI సాయంతో రూపొందించిన ఓ వీడియో రాజకీయంగా వివాదాలకు దారితీసింది.
साहब के सपनों में आईं "माँ"
देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m
— Bihar Congress (@INCBihar) September 10, 2025
ఏఐ సాయంతో రాజకీయ కోణంలో తమ క్రియేటివీని ప్రదర్శిస్తూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఏఐ క్రియేటివిటీతో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్ మోదీ లాంటి పాత్రలతో బిహార్ కాంగ్రెస్ అఫీషియల్‌గానే ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో బిహార్‌లో బీజేపీ vs కాంగ్రెస్ మాటల యుద్ధం మొదలైంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముంది:
ప్రధాని నరేంద్ర మోదీ పోలికలతో ఉన్న పాత్ర రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ‘ఈ రోజు ఓటు చోరీ విజయవంతంగా పూర్తి చేశాం. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు.” అని చెబుతుంది. తర్వాత కాసేపటికి ప్రధాని పాత్ర కలలో.. మోదీ తల్లి హీరాబెన్ పోలికలతో ఉన్న పాత్ర కనిపిస్తుంది. ఓట్ల కోసం నా పేరును ఉపయోగించుకున్నావంటూ దూషించడం మొదలుపెడుతుంది. రాజకీయాల్లో ఓట్ల కోసం ఎంతకైనా తగ్గుతావా అని తిడుతుంది. నోట్ల రద్దు చేసి క్యూలో నిల్చోబెట్టావని అంటుంది. ఆ వెంటనే ప్రధాని మోదీ పాత్రకు మెలకువ వస్తుంది.
మోదీ చేస్తున్న రాజకీయాలపై ఆయనను తల్లి మందలిస్తున్నట్లుగా ఈ ఏఐ వీడియోలో చూపించారు. ఈ వీడియోకు ‘సాహెబ్ కలలోకి అమ్మ వచ్చింది చూడండి’ అంటూ క్యాప్షన్ జత చేసి.. బిహార్ కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. రెండు రోజుల్లోనే ఈ వీడియో వైరల్ కాగా.. దాదాపు 30 లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీంతో బీజేపీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది.
ఈ 36 సెకన్ల వీడియోపై “AI GENERATED” అని స్పష్టంగా ఉన్నప్పటికీ.. దీనిని రాజకీయంగా అపహాస్యం చేసేందుకు కాంగ్రెస్ ఉపయోగించిందని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ అన్ని పరిధులు దాటి చనిపోయిన వాళ్లను అవమానిస్తోందంటూ మండిపడింది.
అయితే ఇందులో కించపరచడానికి ఏముందంటూ కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. మోదీ తల్లిని అవమానించినట్లు ఎక్కడ ఉందో చెప్పాలంది. తప్పు చేసిన కొడుక్కి తల్లి బుద్ధి చెప్పడం కూడా తప్పేనా అంటూ చురకలంటించింది. మరికొన్ని నెలల్లో బిహార్ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ ప్రకంపనలు మొదలుకాగా.. తాజా వీడియో వైరల్ అవుతోంది.


