Local Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనున్నాయి. స్థానిక ఎన్నికల తేదీలు, అసెంబ్లీ సమావేశాలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.
ALSO READ: Atchannaidu : గోదావరి వరదలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి అచ్చెన్నాయుడు
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే పీఏసీ సమావేశంలో సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించి ఎన్నికల వ్యూహం రూపొందిస్తారు. మంత్రులు, బీసీ నేతల మధ్య రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలున్నందున, ఈ అంశంపై స్పష్టత కోసం చర్చ జరుగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నిర్ణయం తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. అయితే, హైకోర్టు సెప్టెంబరు చివరిలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పీఏసీలో యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను తిప్పికొట్టే వ్యూహం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రణాళిక, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరుగనుంది. అలాగే, రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ‘ఓటుచోరీ’ ఉద్యమాన్ని తెలంగాణలో ఎలా నిర్వహించాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. జిల్లాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలను సమన్వయం చేసే బాధ్యతలు సీనియర్ నేతలకు అప్పగించనున్నారు. ఈ సమావేశాలు కాంగ్రెస్‌కు రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే వేదికగా మారనున్నాయి.


