డోన్ టిడిపి రెబల్ అభ్యర్థి గా ఎన్నికల బరిలో ధర్మారం సుబ్బారెడ్డి దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో డోన్ నుంచి టిడిపి అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పేరును టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించడం డోన్ టిడిపిలో ప్రకంపనలు సృష్టించింది. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డి పేరును వేల మంది సమక్షంలో స్వయంగా ప్రకటించి, నేడు మాట తప్పడంపై టిడిపి క్యాడర్ మండిపడుతోంది.
3 ఏళ్ల కష్టం-బాబు అన్యాయం
మూడు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడితే కూడా తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సుబ్బారెడ్డి వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంపై స్పందించిన ధర్మారం సుబ్బారెడ్డి కార్యకర్తల అభీష్టం మేరకే తన భవిష్యత్ కార్యచరణ ఉంటుందంటూ ప్రకటించారు. అయితే మెజార్టీ కార్యకర్తలు స్వతంత్రంగానే బరిలో దిగి పోటీ చేయాలని ధర్మారం సుబ్బారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికలకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్న సుబ్బారెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి తన సత్తా చాటుకోవాలని సిద్ధమవుతున్నట్లు టాక్.
సింపతీనే ఆయుధం..
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన సుబ్బారెడ్డికి టికెట్ దక్కకపోవడం పట్ల పార్టీ క్యాడర్ తో పాటు ప్రజల్లో కూడా సానుభూతి వెళ్లగక్కుతున్నారు. ఆ సానుభూతినే ఆయుధంగా చేసుకొని సుబ్బారెడ్డి రెబల్ గా బరిలో దిగితే టిడిపి భారీ మూల్యం చెల్లించుకోవడం మాత్రం తప్పదంటున్నారు. త్వరలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో ఆ మేరకు నిర్ణయం ప్రకటించి స్వతంత్రంగా ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ధర్మారం సుబ్బారెడ్డి.