దుబ్బాకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కష్టపడిన ప్రత కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. మీరు, ప్రజలు ఇప్పుడు ప్రభాకరన్నను 50 వేలకుపా మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహా చెల్లించి అద్భుత విజయాన్ని సాధించారు. మంచి వ్యక్తి అయిన కొత్త ప్రభాకర్‌కు అందరూ అండగా నిలబడాలి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటాం. మనలో మనకు విభేదాలు వద్దు. మనం విడిపోతే వాళ్లు బాగుపడుతారు. కలిసి వుంటే కలదు సుఖం.
దుబ్బాక అంటే గులాబీ పార్టీ అడ్డా. ఇది తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు. ధర్నాలు, పోరాటాలు, నిరసనలకు ఇది కేంద్రం. దుబ్బాక బీఆర్ఎస్ కంచుకోట. పార్లమెంటు ఎన్నికల్లోనూ దుబ్బాక కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో చేయాలి.
ఈ అసెంబ్లీ ఎన్నికలు మనకు స్పీడ్ బ్రేకర్ వంటివి. బండి నెమ్మదిగా వెళ్లి మళ్లీ వేగం అందుకుంటుంది. మనం నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి. తప్పులు జరిగి వుంటే దిద్దుకుని ప్రజలతో మమేకం కావాలి. మనం ముళ్లబాటలూ చూశాం, పూలబాటలూ చూశాం. ప్రజలు మన ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే తేడాను గుర్తిస్తున్నారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదా? కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు. మన ఏడు మండలాలను, సీలేర్ ప్రాజెక్టులను ఆంధ్రాకు కట్టబెట్టిన ఆ పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. కేంద్రంలో అధికారం కోసమే వాటి పాకులాట. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా దగా చేసింది. కాంగ్రెస్ ది కూడా అదే బాట. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ మనదే.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెర్చవేర్చలేదు. రైతుబంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పి మాట తప్పింది. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హమీని కూడా నిలెబ్టుకోలేదు. ఆసరా పింఛన్ల 4 వేలు ఇస్తామని రెండు వేలు ఇచ్చింది. అధికారంలోకి వస్తే ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ముక్కుపిండి బిల్లు వసూలు చేస్తోంది.
మన ప్రభుత్వం హామీ అమలు రాజీ పడలేదు. మేం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే పింఛన్లు పెంచాం. కరోనా కాలంలో ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు ఆపి మరీ రైతుబంధు పథకాన్ని నిధులిచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. గెలిచిన తెల్లారే పదివేలు ఇచ్చాం.
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ హామీలు తుంగలో తొక్కిందని ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టాలి. పొలం కాడ, పెళ్లికాడ, కాల్వ కాడ ఎక్కడ వీలైతై దాని వైఫల్యాలను ఎండగట్టాలి.
కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో 13 పెద్ద హామీలు ఉన్నాయి. మొత్తం 412 హమీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చాలని మనం డిమాండ్ చేయాలి. పార్లమెంటు ఎన్నికలు వచ్చేలోగా రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు.
పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటడానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి. ఢిల్లీలో మన గొంతు వినిపించడానికి, తెలంగాణ ప్రయోజనాలకు కాపాడడానికి ఈ ఎన్నికలు మనకు కీలకం. మనకు పోరాటాలు కొత్తకాదు. ఎన్నోసార్లు పడ్డాం. పైకి లేచాం. అంతిమ విజయం మనదే.