Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Eetala new sketch?: ఆ పోలీసు అధికారిని తెరమీదికి తెచ్చిందెవరు?

Eetala new sketch?: ఆ పోలీసు అధికారిని తెరమీదికి తెచ్చిందెవరు?

ఇది ఈటల మార్క్ పాచిక అంటున్న బీఆర్ఎస్

అతనో పోలీసు అధికారి. మాజీమంత్రి, బిజెపి నేతకు శిష్యునిగా వ్యవహరించారనే పేరుంది. నాడు ఆయన ఆశీస్సులతో జమ్మికుంటలో సీఐ హోదాలో పనిచేశారు. ఆ బీజేపీ నేత కనుసన్నల్లో పనిచేశారు. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా నాడు వ్యవహరించారు. తాజాగా హుజురాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయ తెరపైకి ఈ ఏసిపి పేరు ఒక్కసారిగా దూసుకురావడం వెనుక జరిగిన కథ ఆసక్తిని కలిగిస్తోంది. పోలీసు అధికారి పేరు ఒక్కసారిగా తెరపైకి రావడం వెనుక ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రజలతో పెద్దగా సంబంధాలు లేని, రాజకీయంగా అనుభవం లేని అధికారిని ఈ వివాదంలోకి ఎందుకు లాగారు? అనేది సర్వత్ర చర్చనీయాంశం అయింది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం బిజెపి చేస్తున్న కుట్రగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

హుజురాబాద్ బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ గెలుపును నల్లేరు మీద నడక చేసేందుకే పోలీసు అధికారి పేరును తీసుకువచ్చారనే అనుమానం బి ఆర్ ఎస్ పార్టీ అధిష్టానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈటల ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు.. బిజెపి పార్టీలో ముఖ్యమైన పదవిలో ఉన్నారు. ఈసారి ఏ విధంగానైనా ఈటల ను ఇంటికి పంపాలనే యోచనలో గులాబీ అధిష్టానం ఉంది. గతంలో అభ్యర్థి ఎంపికలో జరిగిన తప్పిదం ఈసారి జరగకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల వర్గం బిఆర్ఎస్ పై సెంటిమెంట్ ప్రయోగిస్తూ.. టిఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే అధిష్టానం ప్రకటించిన పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ప్రతి అంశాన్ని వివాదం చేస్తూ వస్తోంది. సహజంగానే ఉడుకు రక్తం, దూకుడు కలిగిన కౌశిక్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిలువరించడం కష్టం అనే భావనలో ఉన్న బిజెపి.. కౌశిక్ ను మార్చితే తమకు లబ్ధి చేకూరుతుందని భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ అధిష్టానం అండ, ప్రజల్లోకి సులభంగా చొచ్చుకుపోయే.. యువనేత కౌశిక్ రెడ్డిని మార్చితే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు అవుతుందని.. ఈటల ఇక రాష్ట్రవ్యాప్తంగా సులభంగా ప్రచారం చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉన్నట్లుగా గులాబి అధిష్టానం అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే పోలీసు అధికారి పేరు తెరమీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పత్రిక రంగంలో పనిచేస్తున్న ఓ ఇద్దరు వ్యక్తులు.. పోలీసు అధికారి పేరును తెరమీదకి తీసుకువచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ ఈటలకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారు కావడం గమనార్హం.

ఈటల అనుచరులుగా ఉన్నవారు హుజురాబాద్ రాజకీయ తెరపైకి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోలీసు అధికారి పేరు తీసుకురావడం ఏమిటి? మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే ఇది చేశారా? అనే వాదన ఆసక్తికరంగా మారింది. “మీడియా అధిపతులే.. పార్టీలకు కొమ్ము కాస్తున్నారు.. ఈటలకు కొందరు.. కౌశిక్ రెడ్డికి కొందరు పాత్రికేయులు మద్దతు ఇవ్వడం సహజమే.. ఎవరి పని వారు చేసుకుంటారు.. ఎవరి ఆధిపత్యం వారు ప్రదర్శిస్తారు.. ఎవరి వ్యూహం వారికి ఉంటుంది. ఇవన్నీ ఎన్నికల స్ట్రాటజీలో ఓ భాగం” అని సీనియర్ పాత్రికేయుడు ఒకరు వ్యాఖ్యానించారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సదరు ఏసిపి ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న సందర్భంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు బిజెపి అభ్యర్థికి చేరవేస్తూ కోవర్టుగా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. కౌశిక్ రెడ్డిని మార్చాలనే కుట్రలో భాగంగానే కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు వచ్చినట్లు ఇంటలిజెన్స్ విభాగం బిఆర్ఎస్ అధిష్టానానికి సమాచారం అందించినట్లు తెలిసింది. హుజురాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే కేటీఆర్ కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కేటీఆర్ నిండు బహిరంగ సభలో జమ్మికుంట వేదికగా ప్రకటించారు. అయినప్పటికీ పలువురి పేర్లు తీసుకురావడం, అభ్యర్థి మార్పు ఉంటుందనే దుష్ప్రచారం చేయడం వెనుక.. బిజెపి పార్టీ, ఈటెల వర్గం కుట్ర ఉందని టిఆర్ఎస్ సీనియర్ నాయకుడొకరు పేర్కొన్నారు. “గతంలో హుజురాబాద్, జమ్మికుంట కేంద్రంగా పి.వేణుగోపాలరావు, దాసరి భూమయ్య లాంటి పోలీసు అధికారులు ఎంతో ప్రజాదరణ పొంది.. ఇక్కడి ప్రజలతో మమేకమై పనిచేశారని.. అలాంటి పేరు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చిన అధికారికి లేదని.. ఆయనకు స్థానిక ప్రజలతో కూడా పెద్దగా సంబంధాలు లేవని.. వీటన్నింటిని బట్టి.. బిజెపి ఒక వ్యూహం ప్రకారం “మైండ్ గేమ్” ఆడుతోందన్న విషయం అర్థం అవుతోందని.. గులాబీ అధిష్టానం మరో చారిత్రక తప్పిదం చేయడానికి సిద్ధంగా లేదు” అని ఓ బిఆర్ఎస్ నేత పేర్కొన్నారు. గతంలో ఈటల మంత్రిగా అధికారంలో సమయంలో పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని చెలరేగి పోయాడని.. ఎన్ ఎస్ యు ఐ నేత తిప్పారపు సంపత్ లాంటి అనేక మందిపై కేసులు పెట్టించి పోలీసు అధికారులతో వేధింపులకు గురి చేశాడని అలాంటి పోలీసు అధికారులనే ప్రస్తుతం తన విజయానికి వాడుకోవాలని చూస్తున్నారని కౌశిక్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ఈటల విసురుతున్న ఇలాంటి పాచికల పట్ల గులాబీ పార్టీ అప్రమత్తంగా ఉంటుందని.. ఇట్లాంటి చీప్ ట్రిక్స్.. ప్రస్తుత రాజకీయాల్లో పనిచేయవని.. హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో అలాగే జమ్మికుంట గాంధీ చౌక్ లో.. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే విధంగా సవాల్ చేసే సత్తా.. అలాగే పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే నైజం కౌశిక్ రెడ్డికి ఉన్నాయని.. అతను అయితేనే గులాబీ సైన్యాన్ని ముందుకు నడిపించగలడని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇది ఏమైనా బిజెపి పన్నిన “పోలీసు అధికారి” వ్యూహం.. తుస్సుమందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News