కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం కర్నూలులో జరిగిన జిల్లా స్థాయి బిసి జయహో సభలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి , ఎంజీ బ్రదర్స్ వారసుడు, టిడిపి నాయకులు డాక్టర్ సోమనాథ్ వర్గాలు మధ్య గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్యే బీవీ కు సీటు ఇవ్వాలని ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. మచాని సోమనాథ్ కు సీటు ఇవ్వాలని సోమనాథ్ వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. జిల్లా నాయకుల సమక్షంలోనే తన్నుకోవడం పట్ల జిల్లా నాయకత్వం సీరియస్ అయింది.
బీసీల ఐక్యత పేరుతో..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిసిల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకోవడం ఆ పార్టీ వర్గాలను కలవర పెడుతోంది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలను లెక్కచేయకుండా క్రమశిక్షణ లేకుండా వ్యవహరుంచడంపై అధిష్ఠానం చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారు. వారి ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరించడం సరైన విధానం కాదని పార్టీ పెద్దలు బావిస్తున్నారు.
రగిలిపోయిన బీవీ వర్గం
మొదటి లిస్ట్ లో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పేరు లేకపోవడం పట్ల ఆయన వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీవీకే సీటు ఇవ్వాలని, లేకపోతే నియోజకవర్గంలో టిడిపి నాయకులు కార్యకర్తలు మొత్తం రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు మచాని డాక్టర్ సోమనాథ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, సైకిల్ కు ఓటు వేయండి. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం అంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో బీవీ వర్గీయులకు మింగుడు పడడం లేదు. టిడిపి క్రమశిక్షణ కలిగిన పార్టీ లో ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మిగనూరు సీటు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి ఇస్తారా? లేక బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మచాని సోమనాథ్ కు ఇస్తారో వేచి చూడాలి.