ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఆ దిశగా పటిష్ట ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.
సైలెంట్ పిరియడ్
పోలింగ్ కు 48 గంటల ముందుగానే సైలెంట్ పిరియడ్ అమల్లోకి వస్తుందని, 144 అమల్లోకి వస్తుందని, ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలూ చేయరాదని పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెండ్ పిరియడ్ ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏఆర్వో, ఈస్ట్ ఏసీపీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాల గురించి రిటర్నింగ్ అధికారి వివరించారు.
144 సెక్షన్ అమలు
ఉత్తరాంధ్ర పరిధిలోని 123 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటి వద్ద అన్ని రకాల కనీస వసతులు కల్పించామని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ విధిస్తామని చెప్పారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా సుమారు 739 మంది అధికారులను, సిబ్బందిని కేటాయించామని వివరించారు. అందులో 148 మంది పీవోలు, 148 మంది ఏపీవోలు, 295 మంది ఓపీవోలు ఉన్నారని తెలిపారు. వీరితో పాటు 148 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటారని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు
ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారని వారిలో పురుషులు 13,508, మహిళలు 8,985 ఉన్నారని, వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వారందరికీ ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ ఛైర్లు సమకూర్చామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎండ వేడిమి తగలకుండా షామియానాలు, తాగునీరు, బయోటాయిలెట్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
పోలీంగ్ కేంద్రాలివే..
శ్రీకాకుళంలో 31, విజయనగరంలో 29, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11, విశాఖపట్టణంలో 13, అనకాపల్లిలో 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని రిటర్నింగ్ అధికారి వివరించారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళంలో మొత్తం 5,035 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 3,416, మహిళలు 1,619 ఉన్నారని తెలిపారు. విజయనగరంలో 3,270 మంది పురుషులు, 1,953 మంది మహిళలు కలిసి 5,223 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పార్వతీపురంలో 1,574 మంది పురుషులు, 759 మంది మహిళలు వెరసి 2,333 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం 1,488 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 920, మహిళలు 568 మంది ఉన్నారని చెప్పారు. విశాఖపట్టణంలో 2,539 మంది పురుషులు, 2,990 మహిళలు వెరసి 5,529 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. అనకాపల్లి జిల్లాలో 2,885 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,789 మంది పురుషులు, 1,096 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 27న పోలింగ్
పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 08.00 నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు జరగనుందని, దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను అధికార యంత్రాంగం మొదలు పెట్టిందని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. మార్చి 03వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 08వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని స్పష్టం చేశారు.
రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు
పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసేందుకు అనువుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 26వ తేదీ ఉదయం 6.00 గంటల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ అందజేస్తారని చెప్పారు. అలాగే 27వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుంచి పోలింగ్ సిబ్బంది నుంచి రిసెప్షన్ కేంద్రం వద్ద మెటీరియల్ స్వీకరిస్తారని పేర్కొన్నారు. మెటీరియల్ ను, సిబ్బందిని తరలించేందుకు అనువుగా తగినన్ని వాహనాలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అన్ని జిల్లాలకు తగినంత మెటీరియల్ సిద్ధం చేశామని పేర్కొన్నారు.
అన్ని రకాల చర్యలు
ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగినంత మందిని నియమించామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ఏజెంట్లు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రం లోపలికి సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ముందస్తు తనిఖీలు
హోటళ్లు, లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లలో ముందస్తు తనిఖీలు నిర్వహిస్తామని, అనుమానిత వ్యక్తులు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైలెంట్ పిరియడ్ అమల్లో ఉన్న సమయంలో బయట జిల్లాల వ్యక్తులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, తూర్పు ఏసీపీ మూర్తి పాల్గొన్నారు.