తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ముగ్గురు బీ.ఆర్.ఎస్ లు ఏకమయ్యారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….నా బలమే కార్యకర్తలు అని… ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా నాకు కలిగినట్టేనని, నా చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తానని అన్నారు. మనమందరం కెసిఆర్ బలగమని… మనమంతా ఐకమత్యంగా ఉండి బిఆర్ఎస్ పార్టీని మరింత బలపేతం చేసుకుందామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆయన చేతులకు మనమంతా బలం కావాలని అన్నారు. కార్యకర్తలు పార్టీని కాపాడితే పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని క్రమశిక్షణ కలిగిన పార్టీ టిఆర్ఎస్ అని అందరూ క్రమశిక్షణ దాటద్దని సూచించారు.